ఫోర్‌లేన్‌.. రింగ్‌ రోడ్డు

ABN , First Publish Date - 2022-07-08T04:14:17+05:30 IST

జాతీయ రహదారి నిర్మాణంతో రహదారులు కొత్త అందాన్ని సంతరించుకొంటున్నాయి. జిల్లా చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణంతో రవాణా వ్యవస్థ మరింతగా మెరుగుపడనుంది. ప్రస్తుతం ఉన్న 63వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ మరో జాతీయ రహదారి 363ను నాలుగు వరుసలతో నిర్మిస్తున్నారు. మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ మధ్య రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. శ్రీరాంపూర్‌ సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం నుంచి క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి వద్ద బైపాస్‌ రోడ్డు 363 జాతీయ రహదారికి కలుపుతున్నారు.

ఫోర్‌లేన్‌.. రింగ్‌ రోడ్డు
జాతీయ రహదారి 363 ఊహాచిత్రం

జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం

రూ. 1356.90 కోట్ల వ్యయంతో పనులు  

వచ్చే నవంబర్‌  చివరి నాటికి పూర్తి కావాలనే లక్ష్యం  

మెరుగు పడనున్న రవాణా వ్యవస్థ

నస్పూర్‌, జూలై 7:  జాతీయ రహదారి నిర్మాణంతో రహదారులు కొత్త అందాన్ని సంతరించుకొంటున్నాయి. జిల్లా చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణంతో రవాణా వ్యవస్థ మరింతగా మెరుగుపడనుంది. ప్రస్తుతం ఉన్న 63వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ మరో జాతీయ రహదారి 363ను నాలుగు వరుసలతో నిర్మిస్తున్నారు. మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ మధ్య రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.  శ్రీరాంపూర్‌ సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం నుంచి క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి వద్ద బైపాస్‌ రోడ్డు 363 జాతీయ రహదారికి కలుపుతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, మందమర్రి నుంచి వచ్చే వాహనాలు కరీంనగర్‌, హైదరాబాద్‌ వెళ్ళేం దుకు గాంధారివనం దాటిన  తర్వాత కుర్మపల్లి నుంచి శ్రీరాంపూర్‌ వరకు 12 కిలోమీటర్ల పొడవున బైపాస్‌ నిర్మాణం చేపట్టారు. మంచిర్యాలకు రాకుండానే హైదరాబాద్‌, కరీంనగర్‌లకు వెళ్లే అవకాశం ఏర్పడింది.  దీంతో మంచిర్యాల పట్టణంలో వాహనాల  రద్దీ తగ్గడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. గోదావరిఖని, చెన్నూర్‌ నుంచి వచ్చే వాహనాలు మందమర్రి, బెల్లంపల్లికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది.

జాతీయ రహదారి 363 నిర్మాణం

మంచిర్యాల, ఆసిఫాబాద్‌ వెళ్లే రోడ్డు రాష్ట్రీయ రహదారిగా ఉండగా దీనిని జాతీయ రహదారి 363గా మార్చారు. ఈ రోడ్డును 94 కిలోమీటర్ల పొడవునా రెండు జిల్లాల్లో జరుగుతుంది. రెండు సంవత్సరాల నుంచి ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్‌ మీదుగా రెబ్బన, ఆసిఫాబాద్‌, వాంకిడి, మహారాష్ట్ర సరిహద్దు వరకు  94 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు.  

శ్రీరాంపూర్‌ నుంచి కుర్మపల్లి మధ్య జాతీయ రహదారి 363 పనులు కొనసాగుతున్నాయి. 12 కిలోమీటర్ల పొడవునా రోడ్డు అండ్‌ బ్రిడ్జిలు నాలుగు. చిన్న బ్రిడ్జిలు 16, చిన్న వాహనాలు వెళ్లడానికి 6, పెద్ద భారీ వాహనాలు వెళ్లడానికి పది వంతెనలు, బాక్సు కల్వర్టులు 37, పైపుల కల్వర్టులు 8 నిర్మాణాలు పూర్తయ్యాయి. నాలుగు వరుసల రోడ్డు నిర్మా ణంతోపాటు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, డివైడర్‌, ప్లాంటేషన్‌ చేయనున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తి కావస్తున్నాయి. 42 కిలోమీటర్ల పొడవునా కొనసాగుతున్న జాతీయ రహదారి నిర్మాణం ఇప్పటి వరకు 75 శాతం పూర్తయింది. 

రూ.1356.90 కోట్ల వ్యయంతో

శ్రీరాంపూర్‌ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం సమీపం నుంచి రేపల్లెవాడ వరకు 42 కిలోమీటర్ల పొడవునా 363 జాతీయ రహదారి నిర్మాణ పను లకు దాదాపు రూ. 1356.90 కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  రెండేండ్ల నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 15 యేండ్ల నిర్వహణకుగాను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేయనుంది. 

జాతీయ రహదారి నిర్మాణం కారణంగా 42 కిలోమీటర్ల పొడవునా అధికారులు భూమిని సేకరించారు. 19 గ్రామాలు, 6 మండలాలలో ముంపునకు గురైన భూమిని సేకరించి నష్టపరిహారాన్ని చెల్లించారు. పట్టా భూమి 98.95 హెక్టార్లు, ప్రభుత్వ భూమి 8.87 హెక్టార్లు, అటవీ భూమి  42.55 హెక్టార్లు, సింగరేణి భూమి 87.43 హెక్టార్లు ముంపునకు గురి కాగా  రూ. 127 కోట్లను చెల్లించారు. 

 ఇండ్ల కూల్చివేత, పరిహారం చెల్లింపు

శ్రీరాంపూర్‌ ఏరియాలోని కొత్తరోడ్‌లో జాతీయ రహదారి నిర్మాణం కారణంగా 201 ఇండ్లు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో 160 ఇండ్లకు రూ.3.80 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతోపాటు మరోచోట పునరావాసం కోసం స్థలాన్ని కేటాయించి పట్టాలు ఇచ్చారు. 41 గృహాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంఽఽధించి నాలుగు కేసులు న్యాయ స్థానంలో కొనసాగుతున్నాయి. వీరికి పరిహారం చెల్లించడం కోసం రూ.90.29 లక్షలు కేటాయించారు. 

నవంబర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం 

శ్రీనివాసరావు, జాతీయ రహదారుల డిప్యూటీ మేనేజర్‌

జాతీయ రహదారి 363 నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం 42 కిలోమీటర్ల పొడవునా కొనసాగుతుంది. చాలా చోట్ల వంతెనలు,  ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు పూర్తి చేశాం. రోడ్డు నిర్మాణం కూడా కొన్ని చోట్ల పూర్తయింది. నవంబర్‌ చివరికల్లా రోడ్డును పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్ణయించాం. 

Updated Date - 2022-07-08T04:14:17+05:30 IST