బడుగులపై పిడుగు

ABN , First Publish Date - 2021-04-24T05:20:46+05:30 IST

గు ముగ్గుర్ని చిదిమేసింది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని రేపింది. జి.సిగడాం మండలం బాతువలో ఇద్దరు గొర్రెలకాపరులను, చెట్టుపొదిలాంలో ఉపాధి వేతనదారును బలిగొంది.

బడుగులపై పిడుగు
బాతువలో మృతిచెందిన గొర్రెల పెంపకందారులు




 పిడుగుపాటుకు నలుగురి మృతి

 బాతువలో ఇద్దరు గొర్రెలకాపరులు

 చెట్టుపొదిలాంలో మహిళ 

 బుగతపేటలో వృద్ధుడి దుర్మరణం

జి.సిగడాం, ఏప్రిల్‌ 23:పిడుగు ముగ్గుర్ని చిదిమేసింది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని రేపింది. జి.సిగడాం మండలం బాతువలో ఇద్దరు గొర్రెలకాపరులను, చెట్టుపొదిలాంలో ఉపాధి వేతనదారును బలిగొంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. బాతువ గ్రామానికి చెందిన గొర్రెలకా పరులు బమిడి రాము (50), చందాపు మహాల క్షుంనాయుడు (21)లు గ్రామ శివారులోని పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో ఇద్దరూ ఒకే గొడుగు కింద తలదాచుకున్నారు. ఇంతలో పిడుగుపడడంతో పొలంలోనే కుప్పకూలి పోయారు. కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నా రు. మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరయ్యారు.  మృతుడు రాముకి భార్య సూరీడమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ మిగతా సమయాల్లో గొర్రెలు పెంచుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా డు. మృతుడు మహలక్షుంనాయుడు దూరవిద్యలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లి సీతమ్మ, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు.  రాజాం రూరల్‌ సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ ఎండీ ఆజాద్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలకు శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు.


ఉపాధి పనికి వెళ్లి..విగత జీవిగా మారి

చెట్టుపొదిలాంలో పిడుగుపాటుకు  అవిడి నాగమణి అనే మహిళ మృతిచెందారు. శుక్రవారం మల్లమ్మ చెరువులో ఉపాధి పనులకు ఆమె హాజరయ్యారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆ సమయంలో పిడుగుపడడంతో నాగమణి కుప్పకూలిపోయింది. తోటి వేతనదారులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. నాగమణికి భర్త నాగరాజు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఏపీవో సీహెచ్‌ సత్యనారాయణ, ఉపాధి సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి శవపంచనామా చేశారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. 


వృద్ధుడి మృతి

కోటబొమ్మాళి మండలం బుగతపేట గ్రామానికి చెందిన కిల్లి అప్పన్న (75) అనే వృద్ధుడు  పిడుగు పాటుకు మృతిచెందాడు. శుక్రవా రం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా పిడుగు పడడంతో కుప్పకూలిపోయాడు. తోటి రైతులు గమనించేసరికి మృతిచెందాడు.




Updated Date - 2021-04-24T05:20:46+05:30 IST