Four Congress MPs Suspended: లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరించిన స్పీకర్..

ABN , First Publish Date - 2022-07-25T22:54:21+05:30 IST

లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తిస్తూ సభా కార్యకలాపాలకు..

Four Congress MPs Suspended: లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరించిన స్పీకర్..

న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తిస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మాణికమ్ ఠాకూర్, టీఎన్ ప్రతాపన్, జోతిమణి, రమ్య హరిదాస్‌ను ఈ లోక్‌సభ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విపక్షం కోరుకున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్ష సభ్యులు నిరసన తెలిపారని స్పీకర్ ఓం బిర్లా చెప్పుకొచ్చారు. ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నిరసనకు దిగడంతో సమావేశాలు వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్పణంపై చర్చకు సోమవారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు పట్టుబట్టాయి.



సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీల్లో ఒకరైన లోక్‌సభ ఎంపీ మాణికమ్ ఠాకూర్ మాట్లాడుతూ.. జీఎస్టీ, ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై కేంద్రం దృష్టి సారించే విధంగా విపక్షాలు ప్రయత్నం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం విపక్షాలతో అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిరోజు పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నామని.. తాము వాయిదా తీర్మానాలను ఇస్తున్నామని చెప్పారు. ఇవాళ కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చామని.. అయితే ప్రభుత్వం మాత్రం అదేమీ పట్టించుకోకుండా విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-07-25T22:54:21+05:30 IST