రైతుల పాలిట వి‘పత్తి’

ABN , First Publish Date - 2021-09-18T08:59:50+05:30 IST

పత్తి ఆ రైతుల పాలిట విపత్తుగా మారింది.

రైతుల పాలిట వి‘పత్తి’

పెరిగిన రుణ భారంతో నలుగురి ఆత్మహత్య

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పత్తి ఆ రైతుల పాలిట విపత్తుగా మారింది. కోటి ఆశలతో పంటను సాగు చేసి, దిగుబడి చేతికి వస్తే చేసిన అప్పులు కొంతైనా తీరుతాయని భావించిన ఆ అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు పొలాలను ముంచెత్తడంతో వారి గుండెలు పగిలిపోయాయి. కూతుళ్ల పెళ్లిళ్లు, పంట పెట్టుబడి కోసం చేసిన బాకీల బాధలు మరింత ముసురుకుంటాయని మనస్తాపం చెందిన ఆ నలుగురు రైతులు బలవన్మరణం చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌లో కోరవేని హన్మయ్య(60) రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. భారీ వర్షాలకు పంట దెబ్బతింది. సాగుకోసం, ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు సుమారు రూ.5 లక్షల వరకు పేరుకుపోయా యి. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం  పురుగుల మందు తాగాడు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం చిట్టిగిద్దలో మన్మారి యాదయ్య(48) పంటలు సరిగా పండక, చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగాడు.  నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం రంగుండ్ల తండాలో ఆంగోతు శ్రీను(35) ఇంట్లో దూలానికి ఉరేసుకోగా, నిర్మల్‌ జిల్లా పెంబి మండలం తులసిపేటకు చెందిన నాగుల నర్సయ్య(21)  పురుగుల మందు తాగాడు.  


విద్యుత్‌ షాక్‌తో మరో రైతు..

నిర్మల్‌ జిల్లా మామడ మండలం పరిమండల్‌ గ్రామానికి చెందిన మెట్టు బక్కన్న(75) శుక్రవారం  పొలంలో విద్యుత్‌ వైరు తగలడంతో.. షాక్‌కు గురై మృతి చెందాడు.  చేనులో విద్యుత్‌ వైరు ఎవరు పెట్టారో తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-09-18T08:59:50+05:30 IST