ద్విచక్రవాహనాలు దొంగిలించి.. గంజాయి విక్రయం

ABN , First Publish Date - 2020-10-24T10:19:08+05:30 IST

ద్విచక్ర వాహనాలు చోరీ చేసి వాటి మీద తిరుగుతూ గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ద్విచక్రవాహనాలు దొంగిలించి.. గంజాయి విక్రయం

నలుగురి అరెస్టు 

10.320 కిలోల గంజాయి స్వాధీనం 


బంజారాహిల్స్‌, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాలు చోరీ చేసి వాటి మీద తిరుగుతూ గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 లక్షల విలువ చేసే 10.320 కిలోల గంజాయి, మూడు ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన కళ్యాణ్‌ విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి యువకులకు అలవాటు చేసి వారి ద్వారానే విక్రయిస్తున్నాడు. యూసు్‌ఫగూడ యాదగిరినగర్‌లో నివసిస్తున్న కర్ణాటకకు చెందిన చేతన్‌కుమార్‌, కామారెడ్డికి చెందిన అబ్రార్‌ బిన్‌ హుస్సేన్‌తో పరిచయం పెంచుకున్నాడు.


గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వారికి చెప్పడంతో అంగీకరించారు. కొద్ది రోజులకు ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఉద్రాల రమేష్‌, సాన్యం శివారెడ్డి కూడా గంజాయి అమ్మకంవైపు మొగ్గు చూపారు. గంజాయి అమ్మేందుకు వీరిద్దరూ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. వాటి మీద తిరుగుతూ గంజాయి సరఫరా చేసే వారు. వీరంతా యూసు్‌ఫగూడలో గంజాయి అమ్ముతుండగా జూబ్లీహిల్స్‌ పోలీసులు పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కళ్యాణ్‌ పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2020-10-24T10:19:08+05:30 IST