నాలుగున్నర కోట్ల బడ్జెట్‌..20 కోట్ల వసూళ్లు

ABN , First Publish Date - 2022-06-26T08:58:10+05:30 IST

స్టార్స్‌ లేకుండా తీసిన ఓ సినిమా సైలెంట్‌ గా హిట్‌ అయి సూపర్‌ షేర్స్‌ తో 38 కేంద్రాల్లో వందరోజులు ఆడడమే కాదు సిల్వర్‌ జూబ్లీ జరుపుకోవడం ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్య పరిచిన అంశం. ఆ సినిమా పేరు దేవి.

నాలుగున్నర కోట్ల బడ్జెట్‌..20 కోట్ల వసూళ్లు

 23 ఏళ్ల క్రితమే పాన్‌ ఇండియా ఫిల్మ్‌

స్టార్స్‌  లేకుండా తీసిన ఓ సినిమా సైలెంట్‌ గా హిట్‌ అయి సూపర్‌ షేర్స్‌ తో 38 కేంద్రాల్లో వందరోజులు  ఆడడమే కాదు సిల్వర్‌  జూబ్లీ జరుపుకోవడం ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్య పరిచిన అంశం. ఆ సినిమా పేరు దేవి. ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎమ్మెస్‌ రాజు.  పెద్ద హీరోతో  పెద్ద హిట్స్‌ తీయడం కంటే కథే హీరోగా, గ్రాఫిక్‌ వర్క్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా అతున్నత సాంకేతిక విలువలతో  ఓ సినిమాను నిర్మించి ఘన విజయం సాధించడం గొప్ప విషయమే!. 


దేవి చిత్రాన్ని ప్రారంభించి, కోట్లాది రూపాయలను  ఆ సినిమా మీద ఖర్చు పెడుతున్నప్పుడు నిర్మాత ఎమ్మెస్‌ రాజుని చూసి రకరకాలుగా కామెంట్స్‌ చేశారు. ప్రాజెక్ట్‌ డిలే అవుతున్నకొద్ది ‘హనీ(ఎమ్మెస్‌ రాజుని పరిశ్రమలో అందరూ ఇలాగే పిలుస్తారు) ఓవర్‌ కాన్పిడెన్స్‌తో  అనవసరంగా ఈ సినిమా మొదలు పెట్టాడు... దెబ్బ తింటాడు’ అని. అయినా ఆ కామెంట్స్‌ కు ఏ మాత్రం ఇరిటేట్‌ అవకుండా తన సర్వ శక్తుల్నీ ‘దేవి’ చిత్రం మీదే కేంద్రీకరించారు. దేవి చిత్ర నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా  భావించి, హనీకు అన్ని వేళల్లో అండగా నిలిచారు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈ సినిమా తీయడానికి రెండున్నర ఏళ్లు పట్టింది. అందులో కేవలలం గ్రాఫిక్స్‌ కోసం 18 నెలలు వర్క్‌ చేశారు. అప్పట్లో ఈ చిత్రం గ్రాఫిక్స్‌ బడ్జెట్‌ రూ రెండున్నర కోట్లు. మిగిలిన సినిమా తీయడానికి మరో రెండు కోట్లు ఖర్చు అయ్యాయి. మొత్తం 165 రోజుల పాటు షూటింగ్‌ చేయడం విశేషం. సౌండ్‌ ఎఫెక్ట్స్‌కు, మిక్సింగ్‌కు 35 రోజులు పట్టింది. 


1999 మార్చి 12న ‘దేవి’ చిత్రం విడుదలైంది.  తొలి రోజు నుంచే వసూళ్ల ప్రభంజనం మొదలైంది. ఇండస్ర్టీ పుట్టి పెరిగాక సూపర్‌ సిక్స్‌ గా గుర్తింపు పొందిన చిత్రాల్లో ఒకటిగా ‘దేవి’ నిలిచింది. అయితే మిగిలిన  ఐదు భారీ తారాగణంతో తయారైనవి కావడం గమనార్హం. మలయాళ నటుడు సిజ్జు ఇందులో హీరోగా నటించారు. నటి మంజుల కూతురు  వనిత కథానాయిక. భానుచందర్‌, ప్రేమ, షావుకారు  జానకి, బాబుమోహన్‌ తప్ప మిగిలిన నటీనటులంతా  కొత్తవారే.  ఇమేజ్‌ ఉన్న తారలతో చేేస్త అనుకొన్న ఎఫెక్ట్‌ రాదని నష్టానికి  సిద్థపడే దేవి చిత్రం తీశారు ఎమ్మెస్‌ రాజు. 17 ఏళ్ల దేవిశ్రీప్రసాద్‌  ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 18 రోజుల పాటు రీరికార్డింగ్‌ చేసి, ‘దేవి’ చిత్రానికి ఒక అందం తెచ్చారు దేవిశ్రీప్రసాద్‌. 


తెలుగు స్ర్కీన్‌ మీద అంతకుముందు ఎన్నడూ చూడని స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ‘దేవి’ చిత్రంలో కనిపించడంతో ఆడియన్స్‌ ఓ విచిత్రమైన అనుభూతి కి లోనయ్యారు. ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు రూపాయికి రూపాయి లాభం  చూశారు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ‘దేవి’ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగింది. 23 ఏళ్ల క్రితమే ఈ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ రూ 20 కోట్లు వసూలు చేయడం విశేషం:

Updated Date - 2022-06-26T08:58:10+05:30 IST