మహిళా జర్నలిస్టులకు KTR సన్మానం.. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి నుంచి నలుగురికి..!

ABN , First Publish Date - 2022-03-08T15:20:07+05:30 IST

మహిళా స్వరూపం బహుముఖమని, వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు..

మహిళా జర్నలిస్టులకు KTR సన్మానం.. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి నుంచి నలుగురికి..!

  • బహుముఖం ఆమె స్వరూపం 

హైదరాబాద్ సిటీ /బంజారాహిల్స్‌ : మహిళా స్వరూపం బహుముఖమని, వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణాలో తెలంగాణ ప్రభుత్వం, ఐఎంపీఆర్‌ ఆధ్వర్యంలో సోమవారం మహిళా జర్నలిస్టులను సన్మానించి, అవార్డులు అందజేశారు. కేటీఆర్‌తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు. ‘ఆంధ్రజ్యోతి’ నుంచి గోగ్గుల కవిత, అనురాధ, ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి నుంచి హేమలత, నేహారెడ్డిలు ప్రశంసా పత్రాలతో, సత్కారాలు అందుకున్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే తప్పులు, పనితీరు లోపాలు ఎత్తి చూపాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు.


ఈ కోణంలో రిపోర్టింగ్‌ చేయడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇదే తరుణంలో  ప్రభుత్వం చేసే మంచిని కూడా చూపిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ  మహిళలు వివక్షను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మహిళా యూనివర్సిటీ ప్రకటించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


లైన్‌ విమెన్‌ అంటే గౌరవంగా ఉంటుంది..

ట్రాన్స్‌కోలో మహిళా లైన్‌మన్‌లు 217 మందికి అవకాశం కల్పించడం అభినందనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీటీఎ్‌సకాలనీ జెన్కో ఆడిటోరియంలో సోమవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. లైన్‌మెన్‌లుగా ఎంపికయిన మహిళలను మంత్రులు సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ ఈ నియామకాలు దేశానికే మార్గదర్శనం కావాలన్నారు. వీరిని లైన్‌మన్‌లుగా కాకుండా లైన్‌ విమెన్‌, లైన్‌ మానిటర్‌ లాంటి పదాలతో పిలిస్తే మరింత గౌరవాన్ని తెచ్చేలా ఉంటాయని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌రంగంలో 9,644 మంది ఎంపికయితే అందులో 50 శాతం మహిళలు ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు.


మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్‌కో, జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పూర్తిగా సీఎం కేసీఆర్‌కు అంకితం చేస్తునట్లు ప్రకటించారు. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌ శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మాట్లాడారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు, జేఎండీ డి.శ్రీనివాసరావు, ఎలక్ర్టిసిటీ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ జనరల్‌ సెక్రటరీ అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-03-08T15:20:07+05:30 IST