అక్షరమే ఆయుధంగా!

ABN , First Publish Date - 2022-08-14T05:11:41+05:30 IST

స్వాతంత్ర్యానికి మునుపే జిల్లాలో విద్యాభివృద్ధికి పునాదులు పడ్డాయి. మహోద్యమంలో కీలకపాత్ర పోషించాయి. ఎంతోమంది విద్యార్థులను సమరయోధులుగా తీర్చిదిద్దాయి. నేటికీ విద్యసేవలను అందిస్తూ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాయి.

అక్షరమే ఆయుధంగా!
సాలూరులో వేదసమాజం సంస్కృతోన్నత పాఠశాల

   స్వాతంత్ర్యానికి ముందే విద్యాభివృద్ధికి పునాదులు

  జిల్లాలో ఏర్పాటైన పాఠశాలలు 

  సమరయోధులను తీర్చిదిద్దిన వైనం

 నేటికీ కొనసాగుతున్న విద్యాలయాలు 

  (సాలూరు రూరల్‌)

 స్వాతంత్ర్యానికి మునుపే జిల్లాలో విద్యాభివృద్ధికి పునాదులు పడ్డాయి. మహోద్యమంలో  కీలకపాత్ర పోషించాయి. ఎంతోమంది విద్యార్థులను సమరయోధులుగా తీర్చిదిద్దాయి. నేటికీ   విద్యసేవలను అందిస్తూ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాయి. దాస్య శృంఖాల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని నాడు  ఎందరో మహానుబావులు పోరాటం చేశారు. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపారు. అయితే అక్షరాస్యతతోనూ బ్రిటీష్‌ వారి నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయగలమని నాటి పెద్దలు గ్రహించారు. ఈ మేరకు విద్యాసంస్థలను నెలకొల్పి అక్షరసుమాలను అందరికీ పరిచయం చేశారు. ప్రజల్లో చైతన్యస్ఫూర్తిని నింపగలిగారు.  ఎంతోమంది యోధులుగా మారి ఉద్యమంలో కీలక భాగస్వాములయ్యేలా స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారు.

 బ్రిటీష్‌ వారిని ఎదుర్కొవడానికి చదువును సైతం ఆయుధంగా చేసుకోవాలనే నాటి పెద్దల తలంపుతో విద్యాసంస్థలు పురుడుపోసుకున్నాయి. సాలూరులో ఆ విద్యాసంస్థలు నేటికీ  అప్రతిహతంగా  విద్యాసేవలను అందిస్తున్నాయి.  ఈమేరకు 1888 డిసెంబర్‌ 24న పట్టణంలో దాతల సహకారంతో వేదసమాజం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో విద్యార్థులకు తొలినాళ్లలో సంస్కృతంతో పాటు స్వాతంత్య్ర కాంక్ష రగిల్చేలా ఉపాధ్యాయులు బోధించేవారు. కాలక్రమంలో ఈ స్కూల్‌ మాధ్యమిక,  ఉన్నత పాఠశాలగా మారింది. స్వాతంత్య్రం అనంతరం ఎయిడెడ్‌గా పాఠశాలగా విద్యాసేవలందించింది. జాతీయ ఉపాధ్యాయ అవార్డ్‌ గ్రహీత వి.రాజేంద్రప్రసాద్‌ కృషితో 2003లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా మారింది. మున్సిపాలిటీ నడిబొడ్డున ఉన్న ఈ పాఠశాల నేటికీ ఎంతోమంది విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తోంది. 

  సాలూరు డబ్బీవీధిలో ఉన్న  మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలను సైతం 1890లోనే దాతలు విరాళాలు పొగుచేసి ఏర్పాటు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ పాఠశాలకు 1914లో ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలగా కొనసాగుతోంది. 

  సాలూరులో గొర్లెవీధిలో ప్రాథమిక పాఠశాలను కూడా  1910-12లో స్థానికులు విరాళాలు సేకరించి ఏర్పాటు చేసుకున్నారు. 1921లో సర్కారు గుర్తింపు లభించింది. ప్రస్తుతం మున్సిపల్‌ పాఠశాలగా విద్యాసేవలందిస్తుంది.  

 వందేళ్ల ఘన చరిత్ర

కురుపాం: కురుపాం ప్రాథమిక పాఠశాలకు వందేళ్లకు పైగా ఘన చరిత్ర ఉంది. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు నాడు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.  19వ శతాబ్దం తొలినాళ్లలో అప్పటి జమీందారు వైరిచర్ల వీరభద్రరాజు బహుదుర్‌(మాజీ కేంద్ర మంత్రి కిషోర్‌దేవ్‌ ముత్తాత)  కురుపాం సంస్థానం పాఠశాలను  ప్రారంభించారు.  పాత కోటలోని గుర్రాల శాలలో పాఠశాల తరగతులు నిర్వహించేవారు. కాలక్రమంలో ఈ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా మార్పు చేశారు. 1922 జూలై 17న సర్కారు గుర్తింపు లభించింది. కాలక్రమంలో  ఇది హయ్యర్‌ ఎలిమెంటరీ స్కూల్‌గా ,  ఆ తర్వాత  మిడిల్‌ స్కూల్‌ గాను మార్పు చెందింది. 1952లో హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ అయింది. ప్రస్తుతం హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలగా విద్యా సేవలందిస్తోంది.  

 


Updated Date - 2022-08-14T05:11:41+05:30 IST