అక్షర ‘విజయ’ం

ABN , First Publish Date - 2022-08-13T05:20:50+05:30 IST

విజయనగరంలో తొలుత 1860లో సంస్కృత కళాశాల ఏర్పాటైంది. పూసపాటి రాజవంశీయులు కోట సమీపంలో కళాశాలను నిర్మించారు. ఎంతో మంది మహనీయులు ఇక్కడే ఓనమాలు దిద్దుకున్నారు. సంస్కతాంధ్ర పండితులుగా ప్రఖ్యాతిగాంచారు. వేదాలు, ఉపనిషత్తుల బోధన

అక్షర ‘విజయ’ం
ప్రభుత్వ మహారాజ సంస్కృత కళాశాల

స్వాతంత్రానికి మునుపే విద్యాభివృద్ధికి పునాదులు

విజయనగరంలో ఏర్పాటైన విద్యాసంస్థలు

ముందుచూపుతో వ్యవహరించిన పూసపాటి రాజవంశీయులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

మన దేశం పరాయి పాలనలోకి వెళ్లడానికి ప్రధాన కారణాల్లో నిరక్షరాస్యత ఒకటి. భారతీయుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని విదేశీయులు మన దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించగలిగారు. దీనిని గ్రహించిన విజయనగరం సంస్థానాధీశులు విద్యాభివృద్ధికి పునాదులు వేశారు. 18వ శాతాబ్దంలోనే విజయనగరంలో  విద్యాసంస్థలను నెలకొల్పారు. అక్షరసుమాలను ప్రజలకు పరిచయం చేశారు. ప్రజల్లో చైతన్యస్ఫూర్తిని నింపగలిగారు. స్వాతంత్య్ర పోరాటంలో వారు రగిల్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. విజయనగరం విద్యాసంస్థల్లో చదువుకున్న చాలామంది యోధులుగా మారి ఉద్యమంలో కీలక భాగస్థులయ్యారు. ఉద్యమాన్ని కలికితురాయిగా నిలపగలిగారు. 

 విజయనగరంలో తొలుత 1860లో సంస్కృత కళాశాల ఏర్పాటైంది. పూసపాటి రాజవంశీయులు కోట సమీపంలో కళాశాలను నిర్మించారు. ఎంతో మంది మహనీయులు ఇక్కడే ఓనమాలు దిద్దుకున్నారు. సంస్కతాంధ్ర పండితులుగా ప్రఖ్యాతిగాంచారు. వేదాలు, ఉపనిషత్తుల బోధన సాగేది. తరువాత క్రమంలో తెలుగు భాష అందుబాటులోకి వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడ విద్యాబోధన మారుతూ వచ్చింది. ఇక్కడ చదివిన చాలామంది వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఎదిగారు. ప్రస్తుతం ఈ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. 

 సంగీత కళానిధి..

 1919లో కోట వెనుక భాగంలో మహారాజా సంగీత నృత్య కళాశాలను స్థాపించారు. కళాశాల తొలి ప్రిన్సిపాల్‌గా హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు పనిచేశారు. వయోలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు సైతం కళాశాలలో సేవలందించారు. ఎంతోమంది విద్యార్థులకు బోధన చేశారు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, గాన కోకిల పి.సుశీల, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు, కర్నాటక సంగీత విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణ, ద్వారం భావనారాయణ, నెదురుమల్లి కృష్ణమూర్తి, ద్వారం మంగతాయారు వంటి ప్రఖాత సంగీత కళాకారులంతా ఇక్కడ శిక్షణ పొందిన వారే. 

 ఇంతింతై ఎదిగిన ఎమ్మార్‌ కాలేజీ

1857లో మహారాజ పాఠశాల ప్రారంభమైంది. 1968 నాటికి ఉన్నత పాఠశాలగా అవతరించింది. 1879లో కళాశాలగా రూపాంతరం చెందింది. దీనిని బట్టి అవగతమవుతోంది నాటి రాజుల దురదృష్టి. ఇప్పటివరకూ లక్షలాది మంది ఇక్కడ చదువుకున్నారు. ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థగా నడుస్తోంది. మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా.. అత్యుత్తమ విద్యాబోధన కలిగిన సంస్థగా రూపాంతరం చెందింది. ఉత్తరాంధ్రతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ చేరుతుంటారు. 

కస్పాదీ సుదీర్ఘ చరిత్రే...

విజయనగరం పట్టణంలోని కస్పా పాఠశాల 1913లో స్థాపించారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో అప్పట్లో ఇది ఏర్పాటైంది. పాఠశాలగా ప్రారంభమై ఉన్నత పాఠశాల స్థాయికి చేరింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పటివరకూ వేలాది మంది పాఠశాలలో చదువుకొని ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. స్వాతంత్రం సిద్ధించకముందే విజయనగరంలోని విద్యాసంస్థలు ఇలా విద్యాకుసుమాలను జాతికి అందించాయి. 




Updated Date - 2022-08-13T05:20:50+05:30 IST