రూ.8,300 కోట్లతో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌

ABN , First Publish Date - 2021-12-04T20:53:53+05:30 IST

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడిక్కడ శంకుస్థాపన చేశారు. రూ.8,300 కోట్లతో ఈ ప్రాజెక్టు ..

రూ.8,300 కోట్లతో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌

డెహ్రాడూన్: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడిక్కడ శంకుస్థాపన చేశారు. రూ.8,300 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. దీనితో పాటు రూ18,000 కోట్లతో ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి  కేంద్రం లక్ష కోట్లకు పైగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇవాల్టి అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.18,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. అధునాతన మౌలిక వసతుల కల్పనకు రూ.100 లక్షల కోట్లు పెట్టుబడి లక్ష్యంగా ఇవాళ దేశం పయనిస్తోందని అన్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కారిడార్ సిద్ధమైన తర్వాత ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గుతుందని చెప్పారు.


మన పర్వతాలు, సంస్కృతి కేవలం మన విశ్వాసానికి సంబంధించిన అంశాలే కాకుండా దేశ భద్రతకు పెట్టని కోటలని ప్రధాని కొనియాడారు. పర్వత ప్రాంతాల్లో నివసించే వారు సులభంగా జీవనయానం సాగించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వారు ఇందుకు సంబంధించి ఎలాంటి విధానపరమైన వ్యూహం రూపొందించడపోవడం దురదృష్టకరమని అన్నారు. 2007 నుంచి 2014 మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌లో రూ.600 కోట్లతో కేవలం 288 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరుపగా, తమ ప్రభుత్వం 7 ఏళ్ల పాలనలో ఉత్తరాఖండ్‌లో రూ .12,000 కోట్లతో 2,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిపిందని ప్రధాని చెప్పారు. గత ప్రభుత్వం పర్వత సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో పని చేయలేదని, తాము 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' అమలు చేశామని, ఆర్మీకి ఆధునాతన ఆయుధాలు సమకూర్చామని, ఉగ్రవాదులకు దీటుగా జవాబిచ్చామని చెప్పారు.


ఉత్తరాఖండ్‌లో 3 వైద్యకళాశాలు ఏర్పాటు చేశామని, హరిద్వార్ మెడికల్ కాలేజీకి ఈరోజు శంకుస్థాపన చేశామని ప్రధాని చెప్పారు. రిషీకేష్‌లో ఇప్పటికే ఎయిమ్స్ సేవలు మొదలయ్యాయని, కుమావూలో శాటిలైట్ కేంద్రం ప్రారంభం కానుందని చెప్పారు. వ్యాక్సినేషన్‌లోనూ ఉత్తరాఖండ్ ముందుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారు.


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు రాజకీయాల కోసం రాష్ట్రానికి ఉన్న పేరు చెడగొట్టాలని చూస్తున్నారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం వారి ఆటలు చెల్లవని తాను చెప్పదలచుకున్నానని అన్నారు. ఇలా మాట్లాడే వారు గతంలో చేసిందేమీ లేదని పేర్కొన్నారు. అలాంటి శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు.

Updated Date - 2021-12-04T20:53:53+05:30 IST