మృత్యువుతో పోరాడి ఓడింది

ABN , First Publish Date - 2022-05-19T06:29:47+05:30 IST

గత నెల కారు ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరిని కోల్పోయి ఆస్పత్రి పాలైన చిన్నారుల్లో హర్షిత(ఐశ్వర్య) మృతి చెందింది.

మృత్యువుతో పోరాడి ఓడింది
హర్షిత(ఫైల్‌)

 గత నెల 21న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హర్షిత

 చికిత్స పొందుతూ మృతి

కోదాడ రూరల్‌, మే 18 : గత నెల కారు ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరిని కోల్పోయి ఆస్పత్రి పాలైన చిన్నారుల్లో హర్షిత(ఐశ్వర్య) మృతి చెందింది. ఐదుగురు కుటుంబ సభ్యుల్లో నలుగురు చనిపోవడంతో హన్షిక ఒంటరైంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు బోయిల శ్రీనివాస్‌, భార్య నాగరాణిలకు తమ ముగ్గురు కుమార్తెలు ఉషశ్రీ, హన్షిక, హర్షిత(ఐశ్వర్య)(6). శ్రీనివాస్‌ భార్యాపిల్లలతో కలిసి ఏప్రిల్‌ 21న బైక్‌పై అత్తగారిల్లైన చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి బయలుదేరాడు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కోదాడ, మేళ్లచెర్వుకు వెళ్లే దారిలోని ఫ్లైఓవర్‌ మీద విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు వేగంగా వెనకనుంచి శ్రీనివాస్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో శ్రీనివాస్‌ నాగరాణి, ఉషశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన హన్షిక, హర్షితలను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. 

వైద్య ఖర్చులకు ప్రభుత్వ సాయం

చిన్నారుల వైద్యఖర్చుల కోసం కుటుంబ సభ్యు లు దాతల సహకారాన్ని అభ్యర్థించారు. హన్షిక, హర్షితల వైద్యఖర్చులు భరించడం కష్టంగా మారడంతో ఈ విషయాన్ని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ప్రభుత్వందృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఐసీడీఎస్‌ సంస్థ ద్వారా వైద్య ఖర్చుల కోసం రూ.3లక్షలు మంజూరుచేసింది. చికిత్స పొందుతూ హర్షిత మృతి చెందింది. ప్రభుత్వం అందించిన రూ.3లక్షలు పోను రూ.1.07 లక్షలు చెల్లించి, మృతదేహాన్ని తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ మంత్రి హరీ్‌షరావు దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందింన మంత్రి హరీ్‌షరావు నిమ్స్‌ వైద్యులతో మాట్లాడి మిగిలిన డబ్బును మాఫీ చేయించినట్లు సుధీర్‌ తెలిపారు. హన్షిక ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2022-05-19T06:29:47+05:30 IST