మృత్యువుతో పోరాడి..

ABN , First Publish Date - 2020-10-16T06:43:44+05:30 IST

నిత్యం అన్నయ్యా అంటూ ఇంట్లో పనులు చేసే బాలికపై అత్యాచారయత్నం చేయబోగా.. నెట్టేసిందన్న

మృత్యువుతో పోరాడి..

హైదరాబాద్‌ ఆసుపత్రిలో కన్నుమూసిన బాలిక 

గత నెల 18న యువకుడి అఘాయిత్యం

అత్యాచారం చేయబోయాడు.. నెడితే పెట్రోలు పోసి నిప్పంటించాడు 

కాలిన గాయాలతో చికిత్సపొందుతూ 28రోజుల తర్వాత తుదిశ్వాస


ఖమ్మం సంక్షేమ విభాగం, అక్టోబరు 15 : నిత్యం అన్నయ్యా అంటూ ఇంట్లో పనులు చేసే బాలికపై అత్యాచారయత్నం చేయబోగా.. నెట్టేసిందన్న కోపంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఆ కామాంధుడు. దీంతో 70శాతం కాలిన శరీరంతో 28రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం రాత్రి తుదిశ్వాస విడించింది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడేనికి చెందిన 12ఏళ్ల బాలిక. పల్లెగూడేనికి చెందిన దంపతులకు ఆరుగురు కుమార్తెలు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడింది. ఎలాగూ పాఠశాలలు కూడా లేకపోవడంతో తమ కష్టానికి చేదోడువాదోడుగా ఉంటుందన్న భావనతో ఆ దంపతులు తమ 12ఏళ్ల రెండో కూతురిని ఖమ్మం నగరంలోని పార్శీబంధం ప్రాంతానికి చెందిన అల్లం సుబ్బారావు అనే వ్యక్తి ఇంట్లో పనికి కుదిర్చారు. దీంతో ఆ ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్న బాలికకు నిప్పు అంటుకోవడంతో ఖమ్మం నగరంలోని పూజ ఆసుపత్రిలో చేర్చామని యజమాని కుటుంబం నుంచి గత నెల 18న ఉదయం ఫోన్‌లో సమాచారం అందింది. ఆరోజు నుంచి చికిత్స పొందుతూ కోలుకున్న బాలిక ఈనెల 5న జరిగిన ఘటనను తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


జరిగిందిదీ.. 

గతనెల 18న ఉదయం 6గంటలకు ఆ బాలిక నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన ఇంటి యజమాని కుమారుడు అల్లం మారయ్య ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ బాలిక ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన మారయ్య సమీపంలో ఉన్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పటించాడు. మంటలు వ్యాపించడంతో భయపడిన మారయ్య బాలిక శరీరంపై మంటలు ఆర్పి దుస్తులు తొలగించి.. ఖమ్మంలోని పూజ ఆసుపత్రికి తరలించాడు. అయితే అక్కడ 17రోజుల పాటు సదరు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది గోప్యంగా వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలో ఈ నెల 5న కాస్త కోలుకున్న బాలిక అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే ఖమ్మం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జడ్జి ఉషశ్రీ, ఖమ్మం పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) ఇంజారపు పూజ, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి ఆసుపత్రికి వచ్చి సదరు బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.


అప్పటికే 70శాతం గాయాలవడంతో శరీరం ముడతలు వస్తోందని, మెరుగైన వైద్యసేవలు అవసరమని చెప్పడంతో ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ సూచనలతో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి బాలికను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బాలిక ఆరోగ్యం మరింత క్షీణించటంతో హైదరాబాద్‌లోని రెయిన్‌బో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. దీంతో పదిరోజులుగా హైదరాబాద్‌లో వైద్యసేవలు పొందుతున్న ఆ బాలిక 28రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం రాత్రి కన్నుయూయడంతో దీంతో ఆమె స్వగ్రామమైన ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి. 


ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. 

బాలిక శరీరం 70శాతం కాలిన నేపథ్యంలో ఎంఎల్సీ (మెడికో లీగల్‌ కేస్‌) అయిన తర్వాతే చికిత్స అందించాలి.  కానీ ఖమ్మంలోని పూజ ఆసుపత్రిలో మాత్రం గోప్యంగా 17రోజుల పాటు వైద్యం అందించడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌ ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి ఈ ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళ, యువజన, విద్యార్థి సంఘాలతో పాటు పలు రాజకీయపక్షాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి. 

Updated Date - 2020-10-16T06:43:44+05:30 IST