ఫార్మాసిటీకి భూములిచ్చేందుకు ముందుకు రావాలి

ABN , First Publish Date - 2021-04-14T05:05:00+05:30 IST

ఫార్మాసిటీకి భూములిచ్చేందుకు ముందుకు రావాలి

ఫార్మాసిటీకి భూములిచ్చేందుకు ముందుకు రావాలి
మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

  •  ప్రతీ రైతుకు పరిహారంతో న్యాయం చేస్తాం
  •  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 

యాచారం: యాచారం, కందుకూరు మండలాల మధ్యలో ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ఇళ్లస్థలాలు కేటాయింపునకు తలపెట్టిన మెగా వెంచర్‌ బ్రోచర్‌ను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి ఆవిష్కరిస్తారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట పరిధిలో 400ఎకరాల్లో మెగా వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఫార్మాసిటీ ఏర్పాటులో భూసేకరణలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. భూములిచ్చిన ప్రతి రైతుకు 121 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు. ఇది భూ పరిహారానికి అదనం అన్నారు. వెంచర్‌లో అన్ని వసతులు సమకూరుస్తామన్నారు. భూములిచ్చిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పది రోజుల్లో పరిహార డబ్బు జమచేస్తామన్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.3వందల కోట్లు విడుదల చేసిందన్నారు. భూములు కోల్పోయిన ఏ రైతుకూ అన్యాయం జరగదన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, యాచారం ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీ(పాక్స్‌) చైర్మన్‌ టి.రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జంగమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కె.రమే్‌షగౌడ్‌, కార్యదర్శి పాశ్చ్యబాషా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రైతులకు మంజూరైన సాగు రుణాల చెక్కులను నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేస్తామని యాచారం సొసైటీ చైర్మన్‌ ఈ సందర్భంగా చెప్పారు.

నేడు మల్కీజ్‌గూడలో ఎమ్మెల్యే పర్యటన

బుధవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మల్కీజ్‌గూడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, హైకోర్టు లాయర్‌ దున్ను అంబేద్కర్‌ ఆవిష్కరిస్తారని ఎంపీటీ సీ డి.శారద తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య బాషా, జడ్పీటీసీ పాల్గొంటారని ఆమె చెప్పారు.

Updated Date - 2021-04-14T05:05:00+05:30 IST