విత్తనం.. వెతలు

ABN , First Publish Date - 2022-07-01T05:57:28+05:30 IST

ముందస్తు వర్షాలపై ఆశతో దుక్కి దున్ని సాగుకు సమాయత్తమైన అన్నదాతలను వరుణుడు నిరాశ పరచగా..

విత్తనం.. వెతలు
దుక్కి దున్ని

వరి వంగడాల సరఫరాలో జాప్యం

సాగుకు సిద్ధమైన అన్నదాతల్లో ఆందోళన

ఆర్‌బీకేలకు ఇంకా చేరని రాయితీ విత్తనాలు

11,700 క్వింటాళ్ల వితనాలు అవసరమని అంచనా

15 రోజుల్లో సాగు నీరు విడుదలవనున్నా అందని విత్తనాలు


నరసరావుపేట, జూన్‌ 30: ముందస్తు వర్షాలపై ఆశతో దుక్కి దున్ని సాగుకు సమాయత్తమైన అన్నదాతలను వరుణుడు నిరాశ పరచగా.. ప్రస్తుతం విత్తనాల దొరక్క ఆందోళన పడాల్సి వస్తోంది.  సాగర్‌ జలాలు విడుదల ప్రకటనతో సాగునీటి సమస్య తీరనున్నా.. విత్తనాల వెతలతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పల్నాడు రైతులు ఉన్నారు. జూలై 15న సాగర్‌ కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాయితీపై సరఫరా చేయాల్సిన వరి వంగడాల గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.  విత్తనాల సరఫరాలో జాప్యంంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుకు సిద్ధమైన తరుణంలో విత్తన సమస్య రైతులను వేధిస్తున్నది. జిల్లాలో 1,13,158 ఎకరాల్లో వరి సాగు అవుతుందని, 11,700 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని  వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎన్‌ఎల్‌ఆర్‌, జేజే రకాల విత్తనాలు కిలోకు రూ.5 చొప్పున రాయితీపై ఆర్‌బీకేల ద్వారా ప్రభుత్వం సరఫరా చేయాలి. ఆయా రకాల వరి విత్తనాలను ఆర్‌బీకేలకు 500 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ ఏపీఎస్‌ఎస్‌డీకి ప్రతిపాదనలు ఇచ్చింది. అయితే ఆర్‌బీకేలకు ఇప్పటికి కూడా ఆయా విత్తనాలు అందలేదు. వ్వవసాయ శాఖ ప్రతిపాదనలు పరిశీలిస్తే విత్తన పంపణీ మొక్కుబడిగా సాగుతుందన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతుంది. ముందస్తుగా వరి వంగడాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో కంది విత్తనాలు 550, మినుము 75, పెసర 75 క్వింటాళ్లు ఆర్‌బీకేలకు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ ఇండెంట్‌ ఏపీఎస్‌ఎస్‌డీకి ఇచ్చింది. అయితే ఈ విత్తనాలు కూడా ఇంకా ఆర్‌బీకేలకు చేరలేదు. వరి విత్తనాలను వెనువెంటనే ఆర్‌బీకేలకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ జేడీ ఐ మురళి తెలిపారు. తమ వద్ద బీపీటీ 5204, ఎంటీయూ 1224 రకం వరి విత్తనాలు 1000 కింటాళ్లు సిద్ధంగా ఉన్నాయని ఏసీఎస్‌ఎస్‌డీ డీఎం జీ సుబ్బయ్య తెలిపారు. వ్వవసాయ శాఖ సూచనల మేరకు ఆర్‌బీకేలకు పంపిస్తామని చెప్పారు.  

తక్కువ ధరకే పత్తి, మిర్చి విత్తనాలు 

విత్తన సరఫరాలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా తక్కువకే మార్కెట్‌లో విత్తన విక్రయాలు జరుగుతున్నాయి. ఒక రకం పత్తి విత్తనాలకు  మాత్రమే బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తోంది. ఈ రకం విత్తనం రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. మిగతా అన్ని రకాల పత్తి విత్తనాలు ఎమ్మార్పీ కన్నా ప్యాకెట్‌కు రూ.50 వరకు తక్కువకు విక్రయిస్తున్నారు. రెండేళ్లు మిరప విత్తనాలను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకే మిరప విత్తనాలు మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. మిరపలో 2222, ఆర్మూర్‌  రకం విత్తనాలు మార్కెట్‌లో ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు.   గత ఖరీఫ్‌లో కొన్ని రకాల విత్తనాలను అధిక ధరలకు విక్రయించారు. ఆ రకం విత్తనాలను కూడా ప్రస్తుతం ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీకేల ద్వారా విత్తన సరఫరాకు వ్యవసాయ శాఖ సాహసం చేయడంలేదని వ్యవసాయ అధికారులు తెలిపారు.  మిరప విత్తనాలను ఆర్‌బీకేల ద్వారా విక్రయించేందుకు 3822 ప్యాకెట్‌లను ఏపీఎస్‌ఎస్‌డీ సరఫరా చేసింది. పత్తి విత్తనాలను ఆర్‌బీకేలకు సరఫరా చేయడంలేదు. మార్కెట్‌లో తక్కువ ధరకు లభిస్తుండటంతో ఆర్‌బీకేలకు సరఫరా చేస్తే విక్రయాల జరగకుండా నిల్వలు నిలిచిపోతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  


Updated Date - 2022-07-01T05:57:28+05:30 IST