పద్దులో ఘనం.. ఏదీ.. రుణం!

ABN , First Publish Date - 2022-07-29T05:28:12+05:30 IST

కౌలు రైతులకు రుణ కేటాయింపుల్లో పెద్దపీట వేస్తామంటూ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తోంది.

పద్దులో ఘనం..  ఏదీ.. రుణం!

కౌలు రైతుకు రుణం కరువు.. సాగు బరువు..!

వార్షిక పద్దులో కౌలుదారులకు పెద్దపీట అంటూ ప్రకటనలు

లక్ష్యంలో మూడో వంతుకూడా చేరుకోని వైనం

ఏటికేడు తగ్గుతున్న కౌలుదారుల వాటా

గతేడాది లక్ష్యం రూ.540 కోట్లు.. ఇచ్చింది రూ.198 కోట్లే

అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఊబిలో కౌలు రైతులు


కౌలు రైతులకు రుణ కేటాయింపుల్లో పెద్దపీట వేస్తామంటూ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తోంది. కానీ ఆచరణలో అది కార్యరూపం దాల్చడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సగంమందికి పైగా కౌలు రైతులే ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సరైన రుణ ప్రోత్సాహం అందడం లేదు. గతేడాది ఉమ్మడి గుంటూరు జిల్లాలో 53,000 మందికి సీసీఆర్‌సీ కార్డులిచ్చి రూ.540 కోట్లను వారికి రుణాలుగా ఇవ్వాలని ప్రకటించారు. ఆచరణలో కొచ్చేసరికి 28,000మంది కౌలుదారులకు రూ.198 కోట్లను ఇచ్చి మమ అనిపించారు. అంటే పెట్టుకున్న లక్ష్యంలో 40శాతం మేర కూడా చేరుకోలేదన్న మాట. దీనిని బట్టి కౌలు రైతులపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతోంది. 

  

బాపట్ల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వేల కోట్ల రూపాయలతో వార్షిక పద్దును లీడ్‌ బ్యాంకు వర్గాలు ప్రకటిస్తాయి. అందులో ఘనంగా వ్యవసాయానికి అగ్రతాంబూలమే ఇస్తారు. కౌలురైతులకు ఇచ్చే రుణ కేటాయింపులను అందులో గొప్పగా ప్రకటిస్తారు. ఇదంతా ప్రకటనలకు, కాగితాలకే పరిమితమే తప్ప ఆచరణలో కౌలు రైతులకు దక్కుతున్న రుణాలు తీసికట్టుగా ఉంటున్నాయని గణాంకాలే చెబుతున్నాయి. ఏటికేడు వారి వాటాకు కోత పడడం తప్ప పెరుగుదల కనిపించడం లేదు. సీసీఆర్‌సీ కార్డులున్న వారికే బ్యాంకు రుణాలు తప్ప వేరేవారికి ఆ అవకాశమే లేదు. 


సగంమంది కౌలు రైతులే..

వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో ఉన్న రైతాంగంలో సగంమంది కౌలుదారులేనని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. వీరిలో చాలామంది తమకు ఉన్న చిన్న కమతాలకు తోడుగా ఎంతోకొంత పొలం కౌలుకు తీసుకుని బతుకు బండి లాగిస్తున్నవారే. మరి కొంతమంది అసలు సొంత పొలమే లేకుండా కేవలం కౌలుమీద ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు. వీరి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. వీరంతా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందక, కౌలు కాడి వదిలేయలేక ఎన్నో అగచాట్లతో సేద్యం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు వారికి ఎండమావి చందంగా మిగిలిపోవడంతో అధికవడ్డీలకు అప్పులు తెచ్చి సాగుచేసి వాటిని తీర్చే దారి దొరక్క బలవన్మరణాలకు పాల్పడుతున్న విషాదాంతాలెన్నో వెలుగు చూస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన వార్షిక పద్దులో కూడా కౌలుదారులకు పెద్దపీట వేశామని బీరాలు చెబుతూనే ఉంది.  


 వార్షిక పద్దు(2022--23)లో కౌలు రుణాలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  ఇటీవలే లీడ్‌బ్యాంకు వర్గాలు వార్షిక రుణ పద్దును ప్రకటించాయి. అందులో భాగంగా బాపట్ల జిల్లాలో 10,158 మంది రైతులకు రూ.126 కోట్లు, పల్నాడు జిల్లాలో 14,300 మందికి రూ.194 కోట్లు కౌలుదారులకు రుణాలు ఇవ్వాలనే లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. గుంటూరు జిల్లాలో 23,600 మంది రైతులకు రూ.298 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా విధించుకున్నట్లు వార్షిక పద్దులో ప్రకటించారు.

గతేడాది ఇచ్చింది రూ.198కోట్లే...

గతేడాది ఉమ్మడి గుంటూరు జిల్లాలో 53,000 మందికి సీసీఆర్‌సీ కార్డులిచ్చి రూ.540 కోట్లను వారికి రుణాలుగా ఇవ్వాలని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా ఆచరణలోకొచ్చేసరికి 28,000మంది కౌలుదారులకు రూ.198 కోట్లను ఇచ్చి మమ అనిపించారు. అంటే పెట్టుకున్న లక్ష్యంలో 40శాతం మేర కూడా చేరుకోలేదన్న మాట. ఇక ఉమ్మడి ప్రకాశంలో అయితే కౌలుదారులకు ఇచ్చే రుణ గణాంకాలు మరీ తీసికట్టుగా ఉండడం ఆందోళనకరంగా ఉంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6,000 మంది కౌలు రైతులకు రూ.25కోట్లలోపు రుణాలు అందించగా, గత ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు ఇంతే మొత్తాన్ని  అందించి కౌలురైతులను ఉద్దరిస్తున్నట్లు ప్రభుత్వం మాటలు చెబుతోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇలా...

గత కొన్నేళ్ల నుంచి కౌలు రైతులకు అందించే రుణాలలో కోత పెడుతూనే ఉన్నారు. 2018--19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.154 కోట్లను రుణాలుగా ఇస్తే, 2019-20 సంవత్సరానికి అది రూ.92 కోట్లకే పరిమితమైంది. ఇక 2020-21కి వస్తే మరీ తీసికట్టుగా రూ.75.43కోట్లకు పద్దు కుచించుకుపోయింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కొంతలో కొంత 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.198 కోట్లను రుణాలుగా ఇచ్చారు.

కౌలుదారుల వాటా నామమాత్రమే..

ఏటా వ్యవసాయ రంగానికి వేల కోట్ల రుణ పద్దును యంత్రాంగం ప్రకటిస్తూ ఉంటోంది. ఈ మొత్తంలో కౌలుదారులకు దక్కేవాటా నామమాత్రంగా వందకోట్లలోపే పరిమితమవడం ఆందోళనకర పరిణామంగా నిలుస్తోంది. సేద్యం చేసేవారిలో దాదాపు సగంమంది కౌలుదారులేనని అనధికారిక గణాంకాలు ధ్రువపరుస్తున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్న వీరి సంఖ్య ఉమ్మడి జిల్లాలో లక్షకు చేరువగా ఉంటుందనేది అంచనాగా ఉంది. లీడ్‌ బ్యాంకు ప్రకటిస్తున్న వేల కోట్ల పద్దు అన్నదాతలకు చేరినట్లు ప్రకటిస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో కౌలుదారులకు ఒనగూరుతున్న ప్రయోజనం శూన్యంగా కనబడుతోంది. దీనిని బట్టి అనర్హులు ఎంతోమంది బ్యాంకురుణాలు పొందుతున్నారనేది తేటతెల్లమవుతోంది. ప్రభుత్వం రుణాలు అందించే విషయంలో సమర్థవంతమైన ప్రణాళిక రూపొందిస్తేనే అర్హులైన కౌలుదారులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

సీసీఆర్‌సీ కార్డుల లక్ష్యం అంతంతమాత్రమే...

కౌలుదారులకు అందించే సీసీఆర్‌సీ కార్డుల ప్రామాణికంగానే బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. వీటి విషయంలో వ్యవసాయశాఖ పెట్టుకున్న లక్ష్యం ఆచరణలో చేరడం లేదు. మళ్లీ బ్యాంకు రుణాల దగ్గరకు వచ్చేసరికి కార్డు ఉన్నవారికి వివిధ నిబంధలన పేరిట కోత వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 29,000, పల్నాడులో  32,500, బాపట్ల జిల్లాలో 28,500 సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వాలని లక్ష్యంగా విధించుకున్నారు. మరికొన్ని రోజుల్లో వీటికి సంబంధించి ప్రక్రియ కూడా పూర్తవబోతోంది. నిర్దేశించుకున్న వాటిలో 60శాతం చేరుకున్న గగనమేనన్న విమర్శలు కౌలురైతాంగం దగ్గర నుంచి వ్యక్తమవుతోంది.

బాపట్ల జిల్లాకు ఎల్‌డీఎం...

ఇటీవలే బాపట్ల జిల్లాకు ఎల్‌డీఎంను నియమిస్తూ రిజర్వ్‌ బ్యాంకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఆవిర్భవించిన దగ్గర నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా లీడ్‌బ్యాంకే బాపట్ల జిల్లాను కూడా పర్యవేక్షిస్తూ వస్తోంది. తాజా ఆదేశాల ప్రకారం రైల్వేస్టేషన్‌ దగ్గర ఉన్న యూనియన్‌ బ్యాంకు శాఖ కార్యాలయంలో ఎల్‌డీఎం కార్యకలాపాలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. దీంతో జిల్లాకు సంబంధించి రుణ కేటాయింపులను ఇక్కడ నుంచే పర్యవేక్షించనున్నారు. 

 

Updated Date - 2022-07-29T05:28:12+05:30 IST