ధోనీ కోసం దాదాను పదిరోజులు బతిమాలాం!

ABN , First Publish Date - 2021-06-03T06:22:49+05:30 IST

మహేంద్రసింగ్‌ ధోనీ ఎంత గొప్ప క్రికెటరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఆ స్థాయికి ఎదిగే క్రమంలో ఇతర ఆటగాళ్ల మాదిరే మహీ కెరీర్‌లోనూ

ధోనీ కోసం దాదాను పదిరోజులు బతిమాలాం!

కిరణ్‌ మోరె


ముంబై: మహేంద్రసింగ్‌ ధోనీ ఎంత గొప్ప క్రికెటరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఆ స్థాయికి ఎదిగే క్రమంలో ఇతర ఆటగాళ్ల మాదిరే మహీ  కెరీర్‌లోనూ ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి ఓ ఉదంతాన్ని టీమిండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌, మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరె వెల్లడించాడు. గతంలో ఓసారి ధోనీని దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఆడించేందుకు అప్పటి కెప్టెన్‌ గంగూలీని ఒప్పించేందుకు నానా తిప్పలు పడ్డామని గుర్తు చేసుకున్నాడు. ‘2003-04 దులీప్‌ ట్రోఫీ సమయంలో మేం వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ కోసం చూస్తున్నాం.


నా సహచరులు చెప్పడంతో మహీ ఆటను చూసేందుకు ఆ టోర్నీలో ఓ మ్యాచ్‌కు హాజరయ్యా. ఆ మ్యాచ్‌లో జట్టు స్కోరు 170 అయితే ధోనీ ఒక్కడే 130 రన్స్‌ చేశాడు. అతని ఆటను చూసిన నేను.. ధోనీని దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్‌ తరఫున ఆడించాలనుకున్నా. దీనికోసం అప్పటి కెప్టెన్‌ గంగూలీ వెంటపడ్డా. కానీ, అతనికేమో కోల్‌కతాకు చెందిన దీప్‌దాస్‌ గుప్తాను ఆడించాలని ఉంది. దాదాను పదిరోజుల పాటు బ్రతిమాలితే కానీ, మహీని జట్టులోకి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఆ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులే చేసిన ధోనీ, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 రన్స్‌ చేసి సత్తాచాటుకున్నాడు. దీంతో ఆ వెంటనే ధోనీని ఇండియా-ఎ జట్టు తరఫున కెన్యాలో జరిగిన ముక్కోణపు సిరీ్‌సకు పంపించారు. ఆ టోర్నీలో ప్రతిభ చాటడంతో మహీ కెరీర్‌ మలుపు తిరిగింది. ఆరోజు మేం సరైన గుర్రంపైనే పందెం కాశామని ధోనీ విషయం ద్వారా రుజువు చేశాం’ అని నాటి ఉదంతాన్ని మోరె వెల్లడించాడు. 

Updated Date - 2021-06-03T06:22:49+05:30 IST