- ఎన్నికల మెజారిటీని మతాధిక్యంగా చూపే యత్నం
- మైనారిటీల్లో అభద్రత, అశాంతి: హమీద్ అన్సారీ
- భారత వ్యతిరేక వేదిక సాక్షిగా మోదీ సర్కారుపై విమర్శలు
- విదేశీ ఫోరంలో మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలతో సంచలనం
న్యూఢిల్లీ, జనవరి 27: భారత్‌లో అసహనం నెలకొందని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మరోసారి వ్యాఖ్యానించారు. పదవి నుంచి వైదొలిగేటప్పుడు 2017లోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలపాలయ్యారు. ఇప్పుడు విదేశీ వేదిక సాక్షిగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్(ఐఏఎంసీ) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చర్చలో అన్సారీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ‘భారత్‌లో ప్రతిష్టితమైన పౌర జాతీయవాదం స్థానంలో కొత్త, ఊహాత్మక సాంస్కృతిక జాతీయవాదం అనే ట్రెండ్, సంప్రదాయం ఇటీవలి కాలంలో వచ్చి కూర్చున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో సాధించిన మెజారిటీని మతపరమైన ఆధిక్యంగా చూపి.. రాజకీయ అధికారంపై గుత్తాధిపత్యం సాధించినట్లు భావిస్తోంది. ఈ తీరును చట్టబద్ధంగా, రాజకీయంగా సవాల్ చేయాల్సి ఉంది’ అని ఆయన అన్నారు. కాగా.. అన్సారీ పదవీ విరమణకు 10 రోజుల ముందు రాజ్యసభ టీవీతో మాట్లాడారు. దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతంలో పరమత అసహనం, అశాంతి, అభద్రత నెలకొన్నాయన్నారు. మర్నాడు రాజ్యసభలో ఆయనకు వీడ్కోలు పలుకుతూ ప్రధాని మోదీ గట్టిగా జవాబిచ్చారు.