అప్పుల ఉరికి నేతన్న బలి

ABN , First Publish Date - 2021-12-04T06:52:02+05:30 IST

అప్పుల ఉరికి మరో నేతన్న వేలాడాడు. స్థానిక శివానగర్‌కు చెందిన చెన్నఓబులేసు రెండో కుమారుడు దాసరి లోకేశ (32) అప్పుల బాధ భరించలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల ఉరికి నేతన్న బలి

ధర్మవరం, డిసెంబరు 3: అప్పుల ఉరికి మరో నేతన్న వేలాడాడు. స్థానిక శివానగర్‌కు చెందిన చెన్నఓబులేసు రెండో కుమారుడు దాసరి లోకేశ (32) అప్పుల బాధ భరించలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు... లోకేశ అవివాహితుడు. మూడు మగ్గాలను ఏర్పాటు చేసుకు ని, చీరలు నేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చీరలు అమ్ముడుపోలేదు. చేసేదిలేక ఒక మగ్గం ఎత్తిపెట్టాడు. రెండు మగ్గాలతో చీరలు నేస్తుండేవాడు. అకాల వర్షాల కారణంగా మగ్గాల గుంతల్లోకి నీరు చేరడంతో 20 రోజులుగా వాటినీ నిలిపేశారు. ముడిసరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నేసిన చీరలకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడంలేదు. ఈ క్రమంలో మగ్గాల నిర్వహణ, కుటుంబపోషణకు చేసిన రూ.7 లక్షల అప్పు ఎలా తీర్చాలోనని ఆవేదన చెందుతుండేవాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో మగ్గాల వద్ద ఫ్యానకు ఉరేసుకు ని, ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన తండ్రి.. కుమారుడు ఉరికి వేలాడుతుండటాన్ని చూసి, చుట్టుపక్కల వారిని పిలిచి, శవాన్ని కిందకు దింపాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2021-12-04T06:52:02+05:30 IST