రైతన్నను నట్టేట ముంచిన వేరుశనగ

ABN , First Publish Date - 2021-10-22T05:54:29+05:30 IST

సరైన సమయంలో వర్షాలు కురవక ఈ ఏడుకూడా వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాధారంగా సాగుచేసిన వేరుశనగ పంట రైతులను నట్టేట ముంచింది.

రైతన్నను నట్టేట ముంచిన వేరుశనగ

ఎకరాకి బస్తా దిగుబడి రాని పరిస్థితి

పంటకోత ప్రయోగాలతో తేటతెల్లం

ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న అన్నదాత


చిలమత్తూరు, అక్టోబరు 21: సరైన సమయంలో వర్షాలు కురవక ఈ ఏడుకూడా వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాధారంగా సాగుచేసిన వేరుశనగ పంట రైతులను నట్టేట ముంచింది. మండలంలో 2729 హెక్టార్లలో వేరుశనగ పంటను రైతులు సాగుచేశారు. అయితే విత్తిన సమయంలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడినా ఆ తరువాత ఊడ దశలో కురవలేదు. ఇది పంట దిగుబడిపై పూర్తిగా ప్రభావం చూపింది. ఊడ దశ పూర్తయిన తరువాత మోస్తరు మేర వర్షాలు కురిసినా అది పంట దిగుబడికి ఏ మాత్రం పనికిరాకుండా పోయింది. కేవలం పంట ఏపుగా పెరిగి పైన పటారం... లోన లోటారం అన్న చందంగా మారింది. ప్రస్తుతం పంట కోత జరుగుతుండటంతో పంట దిగుబడులు బయటపడుతున్నాయి. రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పంట దిగుబడిపై ఆంచనాలు సేకరించడానికి వ్యవసాయాధికారులు చేపడుతున్న పంట కోత ప్రయోగాలు అధికారికంగా పంట దిగుబడిని తేటతెల్లం చేస్తున్నాయి. పంటకోత ప్రయోగాల్లో ఎకరానికి 45 కిలోల నుంచి 52 కిలోల దిగుబడికి మించడం లేదు. దీంతో పంట పూర్తిగా నష్టపోయినట్లు రైతులు వాపోతున్నారు. మూడు రోజులుగా మండలంలో దేమకేతేపల్లి, టేకులోడు, యగ్నిశెట్టిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో చేస్తున్న పంటకోత ప్రయోగాలు పంట దిగుబడిని  కనిష్ట స్థాయిలో చూపిస్తున్నాయి. ఎకరానికి విత్తనాలు కొనుగోలు నుంచి పొలం దుక్కి చేయడం, పంటలో కలుపు తీత, ఎరువులు, పంట కోత, నూర్పిడి వంటి వాటికి సుమారు రూ. 15 వేల వరకు ఖర్చు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎకరానికి కేవలం 45 కిలోల నుంచి 52 కిలోల మధ్య దిగుబడి వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


పంట బీమా అందేనా ..?

పెట్టిన పెట్టుబడుల్లో కనీసం పది శాతం కూడా వెనక్కి రాని పరిస్థితి దాపురించిన సమయంలో ఈ ఏడాదైనా పంట బీమా వర్తిస్తుందా? అంటూ రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. పంట చేదికందకపోతే కనీసం బీమా వర్తించినా కొంత ఆసరా దొరికినట్లు అవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే అధికారుల లెక్కల ప్రకారం మండలంలో వేరుశనగ పంటకు అవసరమైన వర్షపాతం నమోదైందని, దీంతో వాతావరణ బీమా వర్తిస్తుందో లేదో చెప్పలేమని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ పంటకోత ప్రయోగాల ఫలితాలతో పంట పూర్తిగా దెబ్బతిందని, దిగుబడి అంతంతమాత్రంగానే ఉందని అధికారులు వివరిస్తున్నారు. గత ఏడాది కూడా మండల రైతులకు బీమా వర్తించలేదు. పంటపూర్తిగా నష్టపోయినా పంటకు అదునుగా సకాలంలో వర్షం కురిసిందనే కారణంతో బీమా అందలేదు. ఇదే పరిస్థితి ఈ ఏడు కూడా రైతులకు ఎదురయ్యింది. ఈ ఏడాది కూడా  ఇదే తంతు జరిగితే తాము ఆర్థికంగా దెబ్బతింటామని రైతులు అంటున్నారు. తమకు పంటల బీమా వర్తింపజేయాలని వారు కోరుతున్నారు.


పూర్తిగా నష్టపోయాం.. ఆదుకోవాలి

మూడు ఎకరాల్లో వేరుశనగ పంట సాగుచేశాను. పంట ఏపుగా పెరిగినా చెట్లలో కాయలు మాత్రం లేవు. ఎకరానికి బస్తా కూడా దిగుబడి రావడం లేదు. పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకున్నాం. ఇప్పుడు పంట నష్టం రావడంతో అప్పులు పాలువుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.

నాగేంద్ర, రైతు, కోట్లోపల్లి, చిలమత్తూరు మండలం


బీమా, ఇనపుట్‌ సబ్సిడీ అందజేయాలి

పంటను పూర్తిగా నష్టపోయాం. రెండు ఎకరాల్లో సాగుచేస్తే రెండు బస్తాలు కూడా రాని పరిస్థితి నెలకొంది. పంట సాగుకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాను. ప్రభుత్వం పంట నష్టం జరిగిన విషయాన్ని గుర్తించి ఇనపుట్‌ సబ్సిడీ, బీమా వర్తింపజేసి ఆదుకోవాలి. 

కిష్టప్ప, రైతు, కోడూరు. చిలమత్తూరు మండలం


Updated Date - 2021-10-22T05:54:29+05:30 IST