Abn logo
Mar 16 2020 @ 04:49AM

ఇల్లు అమ్మి అకాడమీ పెట్టా

Kaakateeya

మహిళల డబుల్స్‌లో భారత్‌కు ఎన్నో మధుర విజయాలను అందించిన ఆ షట్లర్‌ ఆటకు గ్లామర్‌ జోడించి దేశ వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. రెండేళ్లుగా షటిల్‌ కోర్టుకు దూరమైన ఆమె ప్రస్తుతం సొంత అకాడమీ నిర్వహణలో తీరిక లేకుండా శ్రమిస్తోంది. సోషల్‌ మీడియాలో హుషారుగా ఉంటూ సామాజిక అంశాలపై 

తనదైన శైలిలో స్పందించే ఆ మాజీ స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాలతో ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ.


బ్యాడ్మింటన్‌ కోసం జీవితాన్నే అంకితం చేశా

తమిళ నటుడితో డేటింగ్‌ నిజమే


కొత్తగా అకాడమీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఎలా అనిపిస్తోంది?

కెరీర్‌ ప్రారంభంలో సరైన మార్గదర్శనం, సదుపాయాల లేమితో అనేక ఇబ్బందులు పడ్డా. యువ క్రీడాకారులకు అలాంటి సమస్యలు ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో అకాడమీ ఏర్పాటు చేశా. అధునాతన సదుపాయాలను ఉపయోగించుకుంటూ ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇస్తే ఒక సింధు, ఒక జ్వాల కాదు అలాంటి వారిని వందల సంఖ్యలో తయారు చేయవచ్చు. దేశానికి పెద్ద సంఖ్యలో పతకాలు తీసుకురావచ్చు.


అకాడమీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందింది?

అకాడమీ ఏర్పాటుకు సాయం చేయాల్సిందిగా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశా..కానీ అటు నుంచి  స్పందన రాలేదు. ఈ విషయంలో ప్రభుత్వానిది తప్పు కాదు. వారితో నా ఆలోచనలను సరిగ్గా పంచుకోలేకపోయానేమో. అందుకే వారు ముందుకు రాలేకపోయారనుకుంటున్నా. అయితే, ప్రభుత్వం మీద ఆధారపడి అకాడమీ స్థాపనను ఆలస్యం చేయడం సరికాదని నాన్న చెప్పడంతో ఇల్లు అమ్మి పని ప్రారంభించా.


ప్రభుత్వం చేయూత ఇవ్వకుండా ఎవరైనా అడ్డుపడ్డారా?

ఆ విషయం నాకు తెలియదు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు జరిగినా వాటి గురించి పట్టించుకోను. ప్రభు త్వం నుంచి ఎప్పటికైనా సహకారం లభిస్తుందన్న సానుకూల దృక్పథంతో వేచి చూస్తున్నా. నాకు అందుబాటులో ఉన్న వనరులతో వంద మందికి శిక్షణ ఇస్తున్నా. భవిష్యత్‌లో ప్రభుత్వం సాయం చేస్తే 500 మందికి శిక్షణ ఇవ్వగలను. దీనివల్ల అంతిమంగా పతకాలు సాధించే క్రీడాకారుల సంఖ్య పెరుగుతుంది.


ఒలింపిక్‌ పతకం సాధించలేకపోవడానికి కారణాలేంటి?

సింధు, సైనా సింగిల్స్‌లో ఒలింపిక్‌ పతకాలు సాధించారు. డబుల్స్‌లో అయితే, ఇప్పటివరకు ఎవరూ ఒలింపిక్‌ మెడల్‌ నెగ్గలేదు. డబుల్స్‌లో దేశం తరఫున నేను గెలిచిన టైటిళ్లను మరే షట్లర్‌ సాధించలేదు. సింగిల్స్‌లో సింధు, సైనాకు గోపీచంద్‌ ఉన్నాడు. గోపీచంద్‌కు ప్రకాష్‌ పదుకోన్‌ ఉన్నాడు కాబట్టి వారు రాణించగలిగారు. డబుల్స్‌లో నాకు అలా గైడ్‌ చేయడానికి అప్పుడు ఎవరూ లేరు. కష్టపడి పైకొచ్చా. యువ డబుల్స్‌ క్రీడాకారులకు ఒక బాట వేశా. వారికి మార్గదర్శనం చేయడానికి ఇప్పుడు నేనున్నా.


కెరీర్‌లో బాధపెట్టిన సంఘటనలేవి?

బ్యాడ్మింటన్‌ కోసం జీవితాన్నే అంకితం చేశా. అలాంటి నన్ను వరల్డ్‌ నెంబర్‌-6గా ఉన్న సమయంలో పక్కనపెట్టారు. ఆ సంఘటన తీవ్రంగా కలచివేసింది. దీని గురించి సంబంధిత వ్యక్తిని ప్రశ్నించగానే ఆయనకు నేను టార్గెట్‌గా మారిపోయా. భారత డబుల్స్‌లో నంబర్‌ వన్‌ ప్లేయరైనప్పుడు నన్ను గౌరవించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కానీ అతడలా చేయలేదు. కారణం నేను ఆ అకాడమీకి చెందిన క్రీడాకారిణిని కాకపోవడమే.


రాజకీయ అంశాలపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా స్పందిస్తున్నారు. పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశముందా?

జాతీయ పార్టీల నుంచి పిలుపు వచ్చింది కానీ, సున్నితంగా తిరస్కరించా. నా భావసారూప్యతకు ఇప్పుడున్న పార్టీలతో పొసగదు. నా వ్యవహారశైలి ఎవరికీ నచ్చదు. ప్రస్తుతమైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు.


తమిళ నటుడు విష్ణు విశాల్‌తో మీ బంధం గురించి..?

మేం డేటింగ్‌లో ఉన్నాం. వివాహం ఎప్పుడు చేసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు కానీ, త్వరలోనే ఒక్కటవుతాం. అప్పుడు అందర్నీ ఆహ్వానిస్తాం.

Advertisement
Advertisement
Advertisement