అప్పుల్లో ప్రభుత్వాలు, పేదరికంలో ప్రజలు

ABN , First Publish Date - 2021-12-11T06:24:15+05:30 IST

రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశంలోని పేదలు, మైనారిటీలు, మహిళలు, యువకుల అభ్యున్నతి సాధ్యం. లేకుంటే నాటి ఈస్టిండియా కంపెనీ తరహాలోనే నేటి కార్పొరేట్‌ కంపెనీలు పాలకులను కీలుబొమ్మలుగా....

అప్పుల్లో ప్రభుత్వాలు, పేదరికంలో ప్రజలు

రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశంలోని పేదలు, మైనారిటీలు, మహిళలు, యువకుల అభ్యున్నతి సాధ్యం. లేకుంటే నాటి ఈస్టిండియా కంపెనీ తరహాలోనే నేటి కార్పొరేట్‌ కంపెనీలు పాలకులను కీలుబొమ్మలుగా మార్చుకొని, దేశ సంపదను దోచుకుంటూ ప్రజల స్వేచ్ఛాస్వాతంత్య్రాలను హరించివేస్తాయి. 


రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసే వారు మంచివారు కాకపోతే అది చెడ్డ రాజ్యాంగంగా మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చివరి రాజ్యాంగ సభ సమావేశంలో భవిష్యత్తు పాలకులకు హెచ్చరికలు చేశారు. అంబేడ్కర్‌ తరహాలోనే, గణతంత్ర (రాజ్యాంగ) స్వర్ణోత్సవ సంవత్సరం (2000)లో నాటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ సైతం రాజ్యాంగం అమలు తీరుపై లోతైన వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగం విఫలమైందా? లేక మనమే రాజ్యాంగాన్ని విఫలం చేశామా? అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉన్నది’ అని నారాయణన్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఏడుదశాబ్దాల్లో పేదరికం పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, అంతరాలు పెరిగిపోవడం అందోళనకరమైన విషయమే.


ఇది రాజ్యాంగ వైఫల్యంగా చూడాలా? అనే ప్రశ్నకు అంబేడ్కర్‌, నారాయణన్‌ వ్యాఖ్యలు ఒకరకంగా సరైన సమాధానాలే ఇస్తున్నాయి. భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, కులాలు, జాతులను 130 కోట్ల జనాభాగా గుదిగుచ్చి ఉంచుతున్నది భారత రాజ్యాంగం. మనది సంక్షేమ రాజ్యం. ప్రజల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పాటుపడాలనే విషయంపై రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు స్పష్టతనిచ్చాయి. వాటి అమలులోపమే అసలు సమస్య. 


కేంద్రంలో మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నమైన పోకడలు పెరిగిపోతున్నాయి. దేశాన్ని సంఘటితంగా ఉంచుతున్న రాజ్యాంగ పునాదులైన ప్రజాస్వామ్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదంపైనే దాడులు, కుట్రలు జరుగుతున్నాయి. ఆదేశిక సూత్రాలకు భిన్నంగా సంక్షేమ రాజ్యం భావన నుండి కేంద్ర ప్రభుత్వం వేగంగా తప్పుకుంటూ, ప్రైవేటు పెట్టుబడిదారులు, బడా కార్పొరేట్‌లకు ఎర్ర తివాచీ పరిచి ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, దేశ సంపదను కట్టబెడుతున్నది. దీంతో ధనవంతులు మరింత సొమ్ముచేసుకొని ప్రపంచ కుబేరులవుతున్నారు.


రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు సైతం పేద ప్రజలకు అందకపోవడమంటే సిగ్గుపడాల్సిన విషయం. ప్రజలకొరకు, ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజలకు కూడు–గుడ్డ–నీడ అందించడంలో విఫలం చెందాయి. బడా పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నేర చరిత్ర కలిగిన వారు ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నూటికి 90 శాతం ఈ వర్గాలే. ప్రజాసేవకులు కనుమరుగవుతున్న దుస్థితి. పాలకులు ప్రజలను చులకనగా చూస్తున్నారు.


డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగం వయోజనులకు ఓటు హక్కు కల్పించింది. ఓటు హక్కును ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని గెలిపించుకోవడానికి వినియోగించుకోవాలి. దానికి భిన్నంగా నేడు డబ్బు, మద్యం, చీరలు, గంజాయి, కుట్టుమిషన్స్‌ లాంటివి ఇచ్చి ఓటరును ప్రలోభాలకు గురిచేసి అర్ధబలం, అంగబలంతో అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఉపాధి, జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టకుండా చిన్నచిన్న సంక్షేమ పథకాలను ఎరవేస్తున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ వేళ్ళూనుకొని వేగంగా విస్తరిస్తున్నది. శ్రమ దోపిడి మరింత పెరిగింది. ఇలాంటి తరుణంలో నేటి ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ సంక్షేమ పథకాలు ఎరచూపి ప్రజలపైన పెత్తనం చేస్తూ పాలన సాగిస్తున్నారు. 


చమురు, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు ఎంతో పెరిగాయి. మోడి ప్రభుత్వం విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చి ప్రజలను చీకట్లోకి నెట్టివేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టి బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నది. కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకు బకాయిపడ్డ వేల కోట్ల రూపాయలను మాఫీచేసి, మరోపక్క ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నది. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. దేశ జనాభాలో ఒక్క శాతంగా ఉన్న శతకోటీశ్వర్ల సంపద 2009లో 11 శాతం ఉండగా, 2019 నాటికి 21 శాతానికి పెరిగింది. అత్యధిక పేదరికం భారతదేశంలోనే ఉండగా, మరోవైపు కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడమే. పేదరికాన్ని తగ్గించడంకన్నా ప్రపంచస్థాయి కోటేశ్వరులను తయారు చేయడానికి మోడీ ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అదే ఘనతగా చాటుకుంటున్నారు. 


వ్యవసాయ కూలీలకు చేతినిండా సంవత్సర కాలం పనిలేదు. రైతుకు గిట్టుబాటు ధర లేదు. చేతివృత్తుల వారికి ఉపాధి కరువైంది. దేశం అప్పుల కుప్పగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రభుత్వాలు అప్పులలో, ప్రజలు పేదరికంలో వుండటానికి ప్రధాన కారణం పాలకుల మోసపూరిత వాగ్దానాలకు అద్దం పడుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తోన్న ఈ ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నవి. నేరచరితగల నాయకులు తాము చేసిన నేరాల నుండి బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో యన్‌.వి.రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత న్యాయవ్యవస్థలో కొంతవరకు మార్పు వచ్చింది. అన్ని రంగాలలో మాదిరిగానే మీడియాలో సైతం కార్పోరేటీకరణ వచ్చి వారి కనుసన్నలలో నడుస్తున్నది. అసలు సమస్యంతా దేశానికి దిక్సూచిలాంటి భారత రాజ్యాంగ పునాదులను ప్రభుత్వమే పెకలించయత్నించడం.


రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశంలోని పేదలు, సామాన్యులు, మైనారిటీలు, మధ్య తరగతి, మహిళలు, యువకుల అభ్యున్నతి సాధ్యం. లేదంటే నాటి ఈస్టిండియా కంపెనీ తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్పొరేట్‌లు కీలుబొమ్మలుగా మార్చుకొని, దేశ సంపదను దోచుకోవడమే కాకుండా ప్రజల స్వేచ్చ, స్వాతంత్య్రాలను హరించివేస్తాయి. ఇందుకు బాటలు వేస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను తిప్పికొడుతూ, ప్రజాస్వామ్య విలువలనూ, దేశానికి గుండెకాయ లాంటి రాజ్యాంగాన్నీ పరిరక్షించుకోవడం ప్రతీ పౌరుడి బాధ్యత.


చాడ వెంకటరెడ్డి

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2021-12-11T06:24:15+05:30 IST