సీఎం జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్

ABN , First Publish Date - 2020-08-11T23:56:37+05:30 IST

సీఎం జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్

సీఎం జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి విశ్వరూప్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. మంత్రి విశ్వరూప్ అన్ని విషయాలలో దళితులకు వ్యతిరేకంగా పని చేస్తారని ఆరోపించారు. మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యేకు తక్కువ జోకర్ కు ఎక్కువ అని హర్షకుమార్ వ్యాఖ్యనించారు. మంత్రి విశ్వరూప్ జోకర్ లా ఉంటాడని, ముఖ్యమంత్రి జగన్ పెద్ద మోసగాడని, మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దళితుల ఓట్లతో గెలిచి, దళితుల గుండెల్లో గుణపంతో గుచ్చుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా ఉండటం తగదన్నారు. 


కరోనా మరణాలు విషయంలో వాస్తవాలు చెబితే రాష్ట్ర ప్రజల గుండెలు కొట్టుకుంటాయని, ముఖ్యమంత్రికి దమ్ముంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని హర్షకుమార్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవచ్చని, హోటల్లో పెయిడ్ క్వారంటైన్ లో మృతి చెందిన వారికి 50 లక్షలు ప్రకటించిన ముఖ్యమంత్రి, చీరాలలో ఎస్ఐ చేతిలో హత్యకు గురికాబడిన కిరణ్ కుమార్ కు రూ. 10 లక్షలు, సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలికకు రూ. 10 లక్షలు ముస్టి వేశారని విమర్శించారు.


ముఖ్యమంత్రి బాధితులను కనీసం ఫోన్ లో కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు మూడు రోజులు గడువు ఇస్తున్నామని, ఈ నెల 14వ తేదీ సాయంత్రంలోగా దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం సంఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఎస్ఐతో ఫోన్ లో మాట్లాడిన అజ్ఞాన వ్యక్తిని అరెస్టు చేయాలని, చీరాలలో ఎస్ఐ చేతిలో హత్యకు గురైన కిరణ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయలు, సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలికకు రూ. 50 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ లు అమలు చేయకపోతే ఆగస్టు 15వ తేదీన శిరోముండనం జరిగిన దళిత యువకుడు ఇంటి వద్ద నల్ల జెండా ఎగురవేస్తానని హర్షకుమార్ హెచ్చరించారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండా ఎగురవేయాలని దళితులకు మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపు ఇచ్చారు.

Updated Date - 2020-08-11T23:56:37+05:30 IST