మితిమీరుతున్న..వైసీపీ అరాచకాలు, ఆగడాలు..

ABN , First Publish Date - 2020-05-20T10:16:11+05:30 IST

అనపర్తి నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు

మితిమీరుతున్న..వైసీపీ అరాచకాలు, ఆగడాలు..

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 


డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 19:

 అనపర్తి నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.  అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు గుండాల మాదిరి ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహనరెడ్డి పాలన ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉందన్నారు. కరోనా వైరస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకోవడంతో రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం, నాటుసారాను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ మద్యం విధానాలు ఉన్నాయన్నారు. ఇసుక పేరుతో అధికార పార్టీ దోపిడీకి పాల్పడుతోందన్నారు.


ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. జిల్లాలో సుమారు 85 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని, తనపై, నాయకులపై  అట్రాసిటీ కేసు పెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల ఆక్రమాలపై కోర్టును ఆశ్రయించామన్నారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో కక్ష కట్టి ఉపాధి హామీ పఽథకంలో మేట్‌గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మిని తీసివేశారన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవని, ఆమెకు తమ పార్టీ బృందం అండగా ఉంటుందన్నారు. గ్రామంలో ఊరచెరువు పూడ్చివేతను అడ్డుకుంటే అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఎంపీటీసీ అభ్యర్థి సాంబత్తుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తనకు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో నాయకులు బొడ్డు సతీష్‌, జుత్తుగ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-20T10:16:11+05:30 IST