బెయిలుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసుల్లో అనంతపురంలో అరెస్టు అయి కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా

బెయిలుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల

ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి కూడా.. 

భారీగా తరలివచ్చిన జేసీ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు

జనాన్ని చెదరగొట్టిన పోలీసులు


కడప (క్రైం), ఆగస్టు 6 : వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసుల్లో అనంతపురంలో అరెస్టు అయి కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి గురువారం సాయంత్రం 7గంటలకు  బెయిల్‌పై బయటకొచ్చారు. వీరిద్దరికీ బుధవారం అనంతపురం కోర్టు బెయిలు మంజూరు చేయడంతో జేసీ తరపు న్యాయవాది గురువారం సాయంత్రం 4.30గంటల సమయంలో బెయిలు పత్రాలను తీసుకువచ్చి కడప కేంద్ర కారాగార అధికారులకు అందజేశారు. అన్ని పత్రాలు పరిశీలించిన జైలు అధికారులు రిమాండులో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డిని విడుదల చేశారు.


భారీ సంఖ్యలో జేసీ అనుచరులు

కడప కేంద్ర కారాగారంలో 54 రోజుల పాటు రిమాండులో ఉండి విడుదలవుతుండడంతో తాడిపత్రి నుంచి దాదాపు 200 వాహనాల్లో జేసీ అనుచరులు కడప కేంద్ర కారాగారం వద్దకు సాయంత్రం 4గంటలకే చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కడప డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సీఐలు సత్యబాబు, అశోక్‌రెడ్డి, సత్యనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది జనాలను చెదరగొట్టారు. కరోనా నేపధ్యంలో కడపలో ఆంక్షలున్నాయని, పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడదన్న నిబంధనల కారణంగానే పంపించామంటూ పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన కొడుకుతో కలసి జైలు నుంచి ప్రధాన రహదారి వద్దకు నడుచుకుంటూ వచ్చారు. అభిమానులు వారిని చూసి గట్టిగా నినాదాలు చేసి పూలదండలతో ఘనస్వాగతం పలికి బాణసంచా కాల్చారు.


ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు - జేసీ దివాకర్‌రెడ్డి కొడుకు పవన్‌కుమార్‌రెడ్డి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని త మకు ప్రజలు, టీడీపీ అండగా ఉందని తాడిపత్రి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు టీడీపీ నేత పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. బెయిలుపై విడుదలవుతున్న చిన్నాన్న ప్రభాకర్‌రెడ్డి, సోదరుడు అస్మిత్‌రెడ్డిల కోసం ఆయన అనుచరులతో కడప కేంద్ర కారాగారం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాఽఽధింపు చర్యలు చేపట్టిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం నుంచి తాడిపత్రి వరకు అటు అచ్చన్నాయుడు నుంచి ఇటు జేసీ ఫ్యామిలీ వరకు అక్రమ కేసులు పెట్టి కక్ష ధోరణికి పాల్పడుతున్నారని వారికి భయపడే ప్రసక్తి లేదని అన్నారు.


కార్యకర్తలు, అభిమానులు ఇక్కడికి రావద్దని మెసేజ్‌లు పెట్టినప్పటికీ  అభిమానంతో పెద్ద ఎత్తున వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలు వైసీపీకి ఓటు వేశారని, వారు ప్రజలకు సేవ చేయాలే తప్ప టీడీపీపై కక్ష కట్టి వేధించడం సరైంది కాదన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు.


గడియారంలోని ముల్లు కిందికి పోతుంది, మళ్లీ పైకి వస్తుందని, అలాగే రాజకీయాల్లో కూడా ఒకసారి కిందపడ్డా మళ్లీ పైకి వస్తామని టీడీపీ అధికారంలోకి వస్తే పదింతలు చేస్తామని అన్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోందని, దేశంలోనే కరోనా టెస్టుల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పుకుంటున్నారే కానీ కరోనా నివారణలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. స్వయానా వారి పార్టీ ఎమ్మెల్యేనే సరైన సౌకర్యాలు లేవని చెప్పుకొస్తున్నారంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో అర్ధమవుతుందన్నారు. ప్రజలకు సేవ చేయాలే తప్ప కక్ష ధోరణితో వ్యవహరించడం మంచిది కాదని అన్నారు. 

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST