చింతా ప్రభాకర్ చింతను తీర్చిన కేసీఆర్..కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ

ABN , First Publish Date - 2022-02-05T17:31:03+05:30 IST

గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నిర్మాణం మొదలు పెట్టారు. ఇప్పటికే గ్రామ మండల కమిటీలు

చింతా ప్రభాకర్ చింతను తీర్చిన కేసీఆర్..కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చింతను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీర్చారట. ఓ విషయంలో గత కొంతకాలంగా టెన్షన్ పడుతున్న సదరు మాజీ ఎమ్మెల్యేకు ప్రగతి భవన్‌లో గులాబీ బాస్ భరోసా ఇచ్చారట. ఇంతకీ చింతా ప్రభాకర్ చింత ఏమిటి? కేసీఆర్ ఆయనకు ఏమని హామీ ఇచ్చారు? చింతాకు సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష బాధ్యతల తర్వాత కారు పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోందో తెలియాలంటే.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


పార్టీ బలోపేతం మీద పెట్టిన గులాబీ బాస్

గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నిర్మాణం మొదలు పెట్టారు. ఇప్పటికే గ్రామ మండల కమిటీలు వేశారు. తాజాగా జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటించారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా జిల్లా అధ్యక్షులను నియమించారు. అందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొని సొంత పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రౌండ్ లెవల్‌లో యాక్టివ్‌గా పనిచేస్తారనే పేరున్న నేతలను ఎంపిక చేశారు. మెజారిటీ జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లకే బాధ్యతలు అప్పగించారు. మరికొన్ని చోట్ల గట్టిగా పోరాడే నేతల మీద భరోసా పెట్టారు గులాబీ బాస్. అయితే ఇటీవల పరిణామాలతో నైరాశ్యంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పార్టీలో చర్చనీయాంశం అయింది. కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రగతి భవన్ వెళ్లొచ్చిన చింతా ప్రభాకర్ ఆ తర్వాత జోష్‌తో కనిపించడం హాట్ టాపిక్‌ అయింది. ఇంతకీ ప్రగతిభవన్‌లో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.



అక్కడ ఆ ఇద్దరు నేతల మధ్య అధిపత్యపోరు

సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. 2018 ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి ఆయన మీద విజయం సాధించారు. అదే జగ్గారెడ్డిపై 2014లో ప్రభాకర్ గెలిచారు. అక్కడ ఆ ఇద్దరు నేతల మధ్య అధిపత్యపోరు మొదటి నుంచి కొనసాగుతోంది. ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ఓడినప్పటికీ నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడుతున్నారు. అలాంటి నేతకు ఇటీవల కొన్ని పరిణామాలు ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనుల ప్రారంభం కోసం కేటీఆర్ సంగారెడ్డికి వెళ్లినప్పుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలివిడిగా ఉన్నారు. మా నేతలను బాగా చూసుకోవాలని స్వయంగా కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కోరారు. జగ్గారెడ్డి కోరితేనే సీఎం మెడికల్ కాలేజ్ ఇచ్చారని చెప్పారు. తన ప్రత్యర్థిని కేటీఆర్ పొగడటాన్ని చింతా ప్రభాకర్ జీర్ణించుకోవడం లేదని ప్రచారం జరిగింది. 


కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ

మంత్రి కేటీఆర్ సంగారెడ్డి టూర్ తర్వాత చింతా ప్రభాకర్ నైరాశ్యంలోకి వెళ్లినట్లు టాక్ వినిపించింది. మంత్రి కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గం ఉండటం వల్ల చింతా ప్రభాకర్‌కు మంత్రి హరీశ్‌రావుతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. హరీశ్‌ వర్గంగా ఆయనకు ముద్రపడింది. ఇదే సమయంలో ఉమ్మడి మెదక్‌లో కేటీఆర్ వర్గాన్ని తయారు చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్‌లో ఉంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కారెక్కించడానికి ఆయన వర్గం ప్రయత్నాలు చేస్తోందని చర్చ జరుగుతోంది. ఇక జగ్గారెడ్డి వ్యవహారం శైలితో ఆయన గులాబీ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చినప్పుడు జగ్గారెడ్డితో క్లోజ్‌గా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్‌కు మొండిచేయి చూపుతారనే చర్చ మొదలైంది. దీంతో అప్పటి నుంచి చింతా ప్రభాకర్ సైలెంట్ అయ్యారనే గుసగుసలు వినిపించాయి.


చింతాను నియమించడంపై పార్టీలో హాట్‌టాపిక్‌

చింతా ప్రభాకర్ రాజకీయ భవిష్యత్తుపై రకరకాలుగా చర్చ జరుగుతుండగానే.. ఆయనకు కేసీఆర్‌ కీలక భాద్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే చింతాను నియమించడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక కొత్త అధ్యక్షుల నియామకం తర్వాత ప్రగతిభవన్ వెళ్లిన ఆయనకు గులాబీ బాస్ చింత తీరే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. "ప్రభాకర్ నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు.. నాకు అన్నీ తెలుసు.. నీకు నేనున్నా.. నీ పని నువ్ చేసుకుంటూ పో.. ఇక అన్నీ నేను చూసుకుంటా.." అని సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌కు కేసీఆర్‌ అభయం ఇచ్చినట్లు టాక్.  ప్రభాకర్ ఫికర్ వద్దు నేనున్నా అని భుజం తట్టి భరోసా ఇచ్చారట. "వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేస్తాం.. నువ్వు గట్టిగా పనిచేస్తూ పో.." అని కేసీఆర్ హితవు చెప్పినట్లు చర్చ జరుగుతోంది.


సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చిన చింతా ప్రభాకర్

మొత్తానికి సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన నిధులకు తనను కలువు... తాను చూసుకుంటానని చింతా ప్రభాకర్‌కు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారట. దీంతో ప్రగతి భవన్ వెళ్లొచ్చిన తర్వాత చింతాకు చింత తీరిందనీ, ఆయనలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోందని అనుచరులు, సన్నిహితులు చెబుతున్నారు. అధినేత ఆత్మీయ పలకరింపు, ఇచ్చిన అభయం... తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చింతా ప్రభాకర్ చెప్పుకుంటున్నారట. 

Updated Date - 2022-02-05T17:31:03+05:30 IST