నదుల అనుసంధానం ఘనత చంద్రబాబుదే

ABN , First Publish Date - 2020-05-28T08:57:09+05:30 IST

దేశంలోనే మొట్టమొదటిసారిగా నదులను అనుసంధానం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత

నదుల అనుసంధానం ఘనత చంద్రబాబుదే

  • మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం/పుట్టపర్తి/కొత్తచెరువు, మే 27: దేశంలోనే మొట్టమొదటిసారిగా నదులను అనుసంధానం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికే దక్కిందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ఈ ఘనత సాధించారన్నారు. టీడీపీ మహానాడు ప్రతినిధుల సదస్సులో ఆయన రాయదుర్గంలోని తన నివాసం నుం చి జూమ్‌ యాప్‌ ద్వారా ‘సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు’ అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. పోలవరం పనులు పూర్తి కాకముందే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 2016లోనే కృష్ణా డెల్టాకు నీరందించామన్నారు. రాయలసీమకు తానేదో చేస్తున్నానని చెప్పి, చీకటి జీవోల ద్వారా రూ.6 కోట్ల కార్యక్రమాన్ని ప్రకటించి జగన్మోహన్‌ రెడ్డి సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీశారన్నారు. దీని వల్ల రాయలసీమకు అదనంగా ఒనగూరే ప్రయోజనం లేదన్నారు. జగన్మోహన్‌ రెడ్డి చేపట్టాల్సింది రాయలసీమ ఎత్తిపోతల కార్యక్రమం కాదనీ, దమ్ముంటే హంద్రీనీవాను వెడల్పు చేయాలనీ, వేదావతి, ఆర్‌డీఎస్‌, గాలేరు నగరి, హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేయాలన్నారు. గండికోట, సీబీఆర్‌ సామర్థ్యాన్ని పెంచి, ఆయకట్టును స్థిరీకరించాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటూ కేసీఆర్‌తో ఆడుతున్న సరికొత్త రాజకీయ నాటకమని విమర్శించారు. రాయలసీమ ప్రయోజనాల పేరు చెప్పి, ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు రాజశేఖర్‌ రెడ్డి వారసుడిగా జగన్మోహన్‌రెడ్డి కుతంత్రాలు చేస్తున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయటం వల్ల కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీరు చూడగలిగామన్నారు. ప్రాధాన్యాలు మరచి, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే  చేయటం ద్వారా ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందన్నారు.

Updated Date - 2020-05-28T08:57:09+05:30 IST