కమీషన్లకు వైన్‌.. దందాలకు మైన్‌

ABN , First Publish Date - 2020-05-29T08:31:11+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి డీఎన్‌ఏలోనే అవినీతి, ప్రజాధన దోపిడీ అనేవి నాటుకుపోయి ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ

కమీషన్లకు వైన్‌.. దందాలకు మైన్‌

  • శాండ్‌, ల్యాండ్‌లోనూ కోట్లు దోచుకొన్నారు
  • జగన్‌ రెడ్డి డీఎన్‌ఏలోనే అవినీతి ఉంది
  • దేశమంతా జీఎ‌స్‌టీ..ఏపీలో జగన్‌ ట్యాక్స్‌
  • మద్యంపైనే ఆ ట్యాక్స్‌ లక్ష్యం 25 వేల కోట్లు
  • విశాఖలో ‘ఏ2’పాగా, జే గ్యాంగుల చెలగాటం: లోకేశ్‌


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి డీఎన్‌ఏలోనే అవినీతి, ప్రజాధన దోపిడీ అనేవి నాటుకుపోయి ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్‌ అన్నారు. జగన్‌ రెడ్డి బ్లడ్‌ గ్రూప్‌ సీ అని, దాని పూర్తిపేరు కరప్షన్‌ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో అవినీతి పాలన’ అనే అంశంపై మహానాడులో ఆయన మాట్లాడారు. ‘‘ఉన్న ఇల్లు అమ్ముకొనేదశలో ఆయన తండ్రి సీఎం అయ్యారు. ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌ రూ.లక్ష కోట్లు దోచారు. ఇప్పుడు తానే సీఎం అయ్యి పంచభూతాలను దోస్తున్నారు.


దేశమంతా జీఎ్‌సటీ పన్ను అమల్లో ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం జగన్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అమల్లో ఉంది. కమీషన్లకు వైన్‌... దందాలకు మైన్‌ని వాడుకొంటూ అడ్డం గా దోచుకొంటున్నారు. జగన్‌ సిండికేట్‌ అడుగుతున్న 50 శాతం కమిషన్‌ ఇవ్వలేమని ప్రముఖ కంపెనీలు చేతులెత్తేశాయి. దీంతో విషం లాంటి బ్రాండ్లు అధిక ధరలకు అమ్ముతూ, పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మద్యంలో జగన్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ టార్గెట్‌.. ఐదేళ్లలో పాతిక వేల కోట్ల రూపాయలు’’ అని ఆయన ఆరోపించారు. ల్యాండ్‌ కనిపిస్తే దానిని కబ్జా చేయడానికి జే గ్యాంగులు ల్యాండైపోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘విశాఖలో రూ. వెయ్యి కోట్ల విలువైన వాల్తేరు క్లబ్‌ భూమి కబ్జాకు ప్రయత్నించారు. వ్యతిరేకత వచ్చేసరికి వేలంలో దానిని కొట్టేయడానికి స్కెచ్‌ వేశారు. ఐదు ఎకరాల దసపల్లా భూములు కాజేయడానికి చేయని ప్రయత్నం లేదు. రూ.రెండు వందల కోట్ల విలువైన కార్తీకవనం ప్రాజెక్టును ఓవైసీపీ నేత ఆక్రమించారు. ‘ఏ2’ విశాఖలో దిగిన తర్వాత ఏడు నెలల్లో అక్కడ భూ కబ్జాలపై ఐదు వందల కేసులు నమోదయ్యాయి’’ అని ఆయన ఆగ్రహించారు. ఎకరం రూ.ఏడు లక్షలు చేయని భూములను ప్రభుత్వంతో రూ.70 లక్షలకు కొనిపించి వైసీపీ నేతలు వాటాలు వేసుకొని పంచుకొంటున్నారని, ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే ఇలా రూ. 220 కోట్లు కొట్టేశారని లోకేశ్‌ ఆరోపించారు.


‘‘కరోనాను కూడా అవినీతికి వాడుకొన్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కొరియా కిట్లను ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం రూ. 337కు కొనుగోలు చేస్తే జగన్‌ ప్రభుత్వం రూ. 730కి తీసుకొంది. రూ.మూడు  చేయని మాస్కులను రూ.9కి కొన్నారు. ఐదు కోట్ల మాస్కుల్లో రూ. 30 కోట్లు కొట్టేశారు’ అని లోకేశ్‌ విమర్శించారు. టీడీపీ హయాంలో రూ. పదిహేను వందలు ఉన్న ట్రాక్టర్‌ ఇసుక ఇప్పుడు రూ. పది వేలకు చేరిందని, ఎవరి జేబుల్లోకి ఈ డబ్బులు పోతున్నాయని ప్రశ్నించారు. ‘‘కియ, హీరో, హెచ్‌సీఎల్‌, ఫాక్స్‌కాన్‌ వంటి పరిశ్రమలను చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చారు. స్పై విస్కీ, బూమ్‌ బీర్‌, ఆంధ్రా గోల్డ్‌ వంటి మద్యం బ్రాండ్లను జగన్‌ రాష్ట్రానికి తెచ్చారు. చంద్రబాబు హయాంలో యూనిట్‌ విద్యుత్‌ను రూ.నాలుగుకు కొంటే జగన్‌ హయాంలో రూ.11కు కొన్నారు. ఈ అవినీతిని మేం వదిలిపెట్టం. ల్యాండ్‌..శాండ్‌.. మైన్‌.. వైన్‌ అవినీతిపై యుద్ధం చేస్తాం’’ అని  హెచ్చరించారు. 

Updated Date - 2020-05-29T08:31:11+05:30 IST