గులాబీ బాస్ తీరుపై మాజీ మంత్రి అసంతృప్తి.. పార్టీ మారుతారా..!?

ABN , First Publish Date - 2021-12-15T18:29:26+05:30 IST

టీఆర్ఎస్‌లో ఆయనో సీనియర్‌ నేత. మాజీ మంత్రి కూడా. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన.. ఇప్పుడు గులాబీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ ఆ నేత మౌనానికి కారణమేంటి

గులాబీ బాస్ తీరుపై మాజీ మంత్రి అసంతృప్తి.. పార్టీ మారుతారా..!?

టీఆర్ఎస్‌లో ఆయనో సీనియర్‌ నేత. మాజీ మంత్రి కూడా. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన.. ఇప్పుడు గులాబీ పార్టీ కార్యక్రమాల్లో  పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ ఆ నేత మౌనానికి కారణమేంటి? పార్టీ చీఫ్‌పై అసంతృప్తితో ఉన్నారా? హైకమాండ్ తీరుతో ఆయన పక్కచూపులు చూస్తున్నారా? ఇంతకూ అధికార టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ  నేత ఎవరు?.. అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు..

రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు తెలియని వారుండరు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్  పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్లో ఆయన చేరిక తెలంగాణ రాష్ట్ర సాధన సమితికి బలాన్నిచ్చింది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఏర్పడిన  టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్‌లోనే ఉంటున్నా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.


విడిపోయిన జూపల్లి, హర్షవర్ధన్ వర్గాలు..

2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌లో పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత  రాజకీయ  పునరేకీకరణలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్... కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని కారెక్కించుకున్నారు. దీంతో  నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ  జూపల్లి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గాలుగా  విడిపోయింది. ఇక అప్పటినుంచి రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఎవరికి వారే నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి  కృష్ణారావు వర్గానికి పార్టీ టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో ఆయన అనుచరులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. దీని వెనుక జూపల్లి ఉన్నారనే చర్చ సీరియస్‌గానే జరిగింది. ఈ  పరిణామాలు టీఆర్ఎస్ అధిష్టానానికి, జూపల్లికి మధ్య గ్యాప్ పెంచాయనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది.


రాష్ట్రంలో వేగంగ మారుతున్న రాజకీయ పరిణామాలు

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. గులాబీ పార్టీ  అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు రెండు జాతీయ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో దూకుడుగా రాజకీయాలు చేస్తోంది. టీఆర్ఎస్‌లో  పనిచేసిన కీలక నేతలను, ఉద్యమకారులకు కాషాయ కండువా కప్పుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా.. రేవంత్ రెడ్డి రాకతో స్పీడ్ మీద ఉంది. అయితే ఈ రెండు పార్టీలు జూపల్లిని  తమవైపుకు తిప్పుకునేందుకు పోటీ పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.


బీజేపీలోకి  వెళ్లడానికి సుముఖంగా లేరు..?

ఇక జూపల్లి కృష్ణారావు... టీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యంతో కొనసాగుతున్నట్లు టాక్. వచ్చే ఎన్నికల నాటికి తన దారి తాను చూసుకుంటారన్న వాదన వినిపిస్తోంది. ఇదిలాఉంటే,  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన జూపల్లి  కృష్ణారావుకు, డీకే అరుణకు మధ్య రాజకీయంగా వైరం ఉంది. దీంతో జూపల్లి బీజేపీ వైపు వెళ్లడానికి సుముఖంగా లేరన్న చర్చ జోరుగా సాగుతోంది. 


కాంగ్రెస్‎లో చేరుతున్నారని రాజకీవర్గాల్లో చర్చ...

నిజానికి జూపల్లి కృష్ణారావుకు మొదటి నుంచి కాంగ్రెస్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయనకు హస్తం పార్టీ మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ పార్టీకి ఇప్పటికీ గ్రామస్థాయిలో  కూడా మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జూపల్లి అనుచరవర్గం కూడా హస్తం పార్టీలోకి వెళితేనే  మేలని ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే జూపల్లి ఇప్పటికే తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని సరైన సమయంలో ప్రకటిస్తారనే  వాదన జోరుగా వినిపిస్తోంది.

Updated Date - 2021-12-15T18:29:26+05:30 IST