విజయవాడ నుంచి కర్నూలుకు.. పది నిమిషాల్లో రండి!!

ABN , First Publish Date - 2021-04-16T09:56:45+05:30 IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ నోటీసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

విజయవాడ నుంచి కర్నూలుకు.. పది నిమిషాల్లో రండి!!

దేవినేని ఉమ ఇంటికి సీఐడీ నోటీసులు 

సీఎంపై మార్ఫింగ్‌ వీడియోలు ప్రదర్శించారని కేసు నమోదు

ఉదయం 10.20కి గొల్లపూడి ఇంటికి నోటీసు..

పదిన్నరకు కర్నూలు రావాలని సూచన  


గొల్లపూడి, ఏప్రిల్‌ 15: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ నోటీసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం జగన్‌ తిరుపతి విషయంలో చేసిన వ్యాఖ్యలను దేవినేని ఉమ తన ట్యాబ్‌, సెల్‌ఫోన్‌లో మార్ఫింగ్‌ చేసి చూపారని.. విచారణకు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. ఈ నెల 15న(గురువారం) ఉదయం 10.30 గంటలకు కర్నూలులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. గొల్లపూడిలో ఆయన ఇంటికి తాళం వేసి ఉండడంతో సీఐడీ అధికారులు గురువారం ఉదయం 10.20 గంటలకు ఆ ఇంటి గోడకు నోటీసు అంటించి వెళ్లారు. గొల్లపూడి నుంచి కర్నూలుకు  353 కి.మీ. దూరం ఉంది. 


మరీ పదంటే పది నిమిషాల్లో వెళ్లి విచారణకు హాజరు కావాలని ఆదేశించడంపై టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. కాగా, సీఎం వ్యాఖ్యల మార్ఫింగ్‌ విషయంలో దేవినేని ఉమ వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ పంపామని.. గురువారం కర్నూలు సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నట్లు సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ కర్నూలులో మీడియాకు చెప్పారు. ఆయన రాకపోవడంతో సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అతికించినట్లు తెలిపారు.

Updated Date - 2021-04-16T09:56:45+05:30 IST