సీఎం మాట్లాడరేం!

ABN , First Publish Date - 2021-05-15T10:00:04+05:30 IST

నాలుగు రోజులుగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో రోగులను అమానవీయంగా నిలిపివేసి వేధిస్తుంటే సీఎం జగన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి ..

సీఎం మాట్లాడరేం!

తన పౌరుల జీవించే హక్కును కాలరాస్తుంటే ప్రశ్నించే పని లేదా?

ముఖ్యమంత్రి చేతగానితనంతోనే సమస్య

సరిహద్దు వివాదాలపై నక్కా ఆనందబాబు

అమరావతి, విశాఖపట్టణం, మే 14(ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో రోగులను అమానవీయంగా నిలిపివేసి వేధిస్తుంటే సీఎం జగన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ హైకోర్టు పదేపదే చెబుతున్నా పోలీసులు మాత్రం ఆంధ్ర నుంచి వస్తున్న అంబులెన్సులను ఆపుతూనే ఉన్నారన్నారు. చివరకు రోగులు ప్రాణాలు కోల్పోతున్నా సీఎం మౌనవ్రతం వీడటం లేదని విమర్శించారు. ‘‘ఏపీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? తన పౌరుల జీవించే హక్కును కాలరాస్తుంటే ప్రశ్నించే పనిలేదా? ఏపీ సీఎం చేతగానితనాన్ని లోకువగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని అనుమానించాల్సి వస్తోంది. ప్రశ్నించలేనంత పిరికితనం ఏమిటి?’’ అని విస్మయం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన ముఖ్యులకు, మంత్రులకు కరోనా వస్తే వారిని చేర్చుకోవాలని సీఎం కార్యాలయం ప్రతి రోజూ హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు ఫోన్లు చేస్తోందని, సామాన్యులను సరిహద్దుల్లో నిలిపివేస్తే మాత్రం తమకేం సంబంధం లేనట్లుగా దులుపుకొంటోందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులను దృష్టిలో ఉంచుకొని తమ రాష్ట్రానికి వ్యాక్సిన్లు, రెమిడెసివర్‌ ఇంజక్షన్లు అధికంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ సీఎం... ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిని ప్రశ్నించలేకపోతే ప్రజల దృష్టిలో జగన్‌రెడ్డి అసమర్థునిగా మిగిలిపోతారని ఆనంద్‌బాబు హెచ్చరించారు. 

చేతకాని రాష్ట్ర ప్రభుత్వం: విష్ణుకుమార్‌రాజు

వైద్యం కోసం అన్ని అనుమతులతో హైదరాబాద్‌ వెళుతున్న వారిని ఆపడం తగదని, వారిని అనుమతించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం చేతగానితనం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-15T10:00:04+05:30 IST