అన్నదాత ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-05-18T05:55:06+05:30 IST

సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా భూములు సేకరించాలి. వాటిని ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.

అన్నదాత ఎదురుచూపు
మరమ్మతులకు నోచుకోక అలాగే ఉన్న నల్లబండ చెరువు

  1. చెరువు నిర్మాణానికి 120 ఎకరాల సేకరణ
  2. తొమ్మిదేళ్లుగా పరిహారం ఇవ్వని ప్రభుత్వం
  3. నిర్మాణం పూర్తయిన వెంటనే చెరువుకు గండి
  4. ఎనిమిదేళ్లు అవుతున్నా... బాగుచేయలేదు
  5. భూములిచ్చిన, ఆయకట్టు రైతుల ఆవేదన


ఎమ్మిగనూరు, మే 17: సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా భూములు సేకరించాలి. వాటిని ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. నిర్ణీత వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేసి, లక్ష్యం మేరకు సాగునీరు అందించాలి. కానీ ఇవేమి చేయకుండానే అధికారులు, కాంట్రాక్టర్‌ చెరువు నిర్మాణ పనులను చేపట్టారు. నిర్మాణం పూర్తి అయిన కొన్నాళ్లకే.. చిన్నపాటి వర్షానికి గండిపడింది. చెరువు ప్రారంభానికి నోచుకోక ముందే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఏళ్లు గడిచినా రైతులకు సాగునీరు అందలేదు. భూములు ఇచ్చినవారికి పరిహారం కూడా ఇవ్వలేదు. కొన్నేళ్ల నుంచి సాగునీటి కోసం ఆయకట్టు రైతులు, పరిహారం కోసం భూములు పోగొట్టుకున్నవారు ఎదురు చూస్తూనే ఉన్నారు. 


350 ఎకరాలను తడపాలని.. 

ఎమ్మిగనూరుమండలంలోని గువ్వలదొడ్డి, పార్లపల్లి, పెద్దమర్రివీడు గ్రామాల పరిధిలోని 350 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గువ్వలదొడ్డి సమీపంలో నల్లబండ వంకపై చెరువు నిర్మించారు. 120 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చెరువు కోసం రూ.2.70 కోట్లు వెచ్చిం  చారు. 2012 నవంబరులో ప్రారంభించి 2013 మార్చిలో పూర్తి చేశారు. 


కాలువలు తవ్వేలోగా..

చెరువు పనులు పూర్తయి, సాగునీటి కాలువ పనులు జరుగుతుండగానే 2013 సెప్టెంబరు 15న వర్షం కురిసింది. ఈ వానకు వంక పొంగి పొర్లింది. ఆ మాత్రం నీటి ఉధృతికే చెరువు కరకట్టకు భారీగా గండిపడింది. చిన్నపాటి రంధ్రంతో మొదలై.. చెరువు కట్ట తెగిపోయేవరకూ అధికారులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం చెరువు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. కరకట్టకు వాడిన రాళ్లు పరుపు, మట్టి సరైంది కాకపోవడంతో గండి పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్లు కావస్తున్నా, నేటికీ చెరువు కరకట్టకు మరమ్మతు చేయలేదు. దీంతో నిరుపయోగంగా మారింది. రూ.కోట్లు వెచ్చించినా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆశయం నెరవెరలేదు. 


ఎదురుచూపులే.. 

నల్లబండ చెరువు నిర్మాణ పనులు చేపట్టక ముందే భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం అందించాల్సి ఉంది. రెండు, మూడు పంటలు పండే 120 ఎకరాలు భూములను అధికారులు సేకరించారు. భూములను తీసుకున్నదే తడువుగా పనులు చేపట్టారు. వేగంగానే పూర్తి చేశారు. ఇప్పటికి రెండు ప్రభుత్వాలు మారాయి. రైతులకు పరిహారం అందలేదు. కరకట్ట మరమ్మతులు చేపట్టలేదు. మరమ్మతు చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్‌ 2014 మేలో చెరువు వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు తమ భూములకు పరిహారం చెల్లించి, పనులు చేపట్టాలని అడ్డుకున్నారు. దీంతో అధికారులు, కాంట్రాక్టర్‌ వెనుదిరిగారు.


పరిహారం చెల్లించాలి..

నల్లబండ చెరువు నిర్మాణానికి మా భూమి మూడు ఎకరాలు ఇచ్చాము. ఇప్పటి వరకు పరిహారం రాలేదు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు పట్టించుకోవడం లేదు. వారి నిర్లక్ష్యం మూలంగా అటు భూములకు పరిహారం అందలేదు, ఇటు సాగునీరు అందలేదు. ఉన్నతాధికారులు స్పందించి నష్టపరిహారం అందేలా చూడాలి. 

- లింగప్ప గౌడ్‌, గువ్వలదొడ్డి 


వలసపోవాల్సి వస్తోంది..

ఉన్న భూమి నల్లబండ చెరువు నిర్మాణంలో పోయింది. సాగు చేసుకునే అవకాశం లేదు. మరోదారిలేక ప్రతిసారి సుగ్గికి పోతున్నాం. అక్కడ కూలీనాలి చేసుకుని వస్తున్నాం. ఇప్పటివరకు పరిహారం రాలేదు. ఇంకా ఎన్నిరోజులు ఎదురు చూడాలో తెలియదు. 

 - చంద్ర, గువ్వలదొడ్డి


ఇబ్బంది పడుతున్నాం

నల్లబండ చెరువు నిర్మాణం వల్ల మా తమ్ముడు, నేను 10 ఎకరాల భూమిని కోల్పోయాము. భూమి తీసుకుని తొమ్మిదేళ్లు ఆయినా, ఇప్పటికీ నష్టపరిహారం రాలేదు. మిగిలిన కొద్దిపాటి భూమిలోనే జీవనం సాగించాల్సిన పరిస్థితి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారింది. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలి. 

- లక్ష్మన్న గౌడ్‌, గువ్వలదొడ్డి 

Updated Date - 2021-05-18T05:55:06+05:30 IST