సాగేదెట్లా?

ABN , First Publish Date - 2021-06-24T05:20:45+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. మృగశిర కార్తె వచ్చి పదిహేను

సాగేదెట్లా?

  • ప్రారంభమైన వానాకాలం సీజన్‌ 
  • ఊసేలేని పంటరుణాల ప్రణాళిక 
  • ఏ మూలకు సరిపోని రూ.5 వేల సాయం 
  • పంట రుణాలపై సందిగ్ధం! 
  • అన్నదాతల అయోమయం


వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. మృగశిర కార్తె వచ్చి పదిహేను రోజులు గడిచింది. జిల్లాలో మోస్తరు  వర్షాలు కురియడంతో  రైతులు వ్యసాయ పనుల్లో నిమగ్న మయ్యారు. అయితే వానాకాలం సాగు పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  కొత్త  వార్షిక రుణ ప్రణాళిక తయారు చేయకపోవడంతో బ్యాంకర్లు రుణాల పంపిణీ మొదలు పెట్టలేదు. దీంతో పంటరుణాలు అందక, రైతుబంధుసాయం  ఏమూలకు సరిపోక అన్నదాతలు మదనపడుతున్నారు. ఇప్పుటికే అప్పుల భారంతో ఉన్న రైతులు పంట సాగు పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.


పరిగి:  ఓవైపు వానాకాలం సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతుండగా, మరో వైపు పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృగశిర కార్తె వచ్చి పదిహేను రోజులు గడిచింది. జిల్లాలో మోస్తరు వర్షాలు కురియడంతో  రైతులు వ్యసాయ పనుల్లో నిమగ్న మయ్యారు. అయితే వానాకాలం సాగు పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాల్లో జమఅయిన  రైతుబంధు డబ్బులు  పెట్టుబడులకు ఏ మూలకు సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని చోట్ల రైతుబంధు డబ్బులను  పాత రుణాల రికవరీలో జమ చేసుకున్నారు.  యాసంగి సీజన్‌లో పంటలు బాగానే పండినప్పటీకీ ధాన్యం విక్రయించిన డబ్బులు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంకట పరిస్థితిలో  వానకాలం సాగుపై రైతులు మదనపడుతున్నారు. ఇప్పుటికే అప్పుల భారంతో ఉన్న రైతులు పంట సాగు పెట్టుబడులకు మరోసారి  ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  వార్షిక రుణ ప్రణాళిక తయారు చేయకపోవడంతో బ్యాంకులు  రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీపై కూడా ఆశలు ఆడియాశలవుతున్నాయి. మరో పక్కపంటరుణాలకు వడ్డీ మాఫీ కాకపోవడంపై రైతులకు భారంగా పరిణమించింది. పంటరుణాల వార్షిక ప్రణాళిక తయారు కాకపోవడం,  రైతులకు కొత్త పట్టాపాసుపుస్తకాలు జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో టైటిల్‌తో రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం పంట రుణాల గురించి అధికారులు ఏం తేల్చలేకపోతున్నారు. 

వికారాబాద్‌ జిల్లాలో 5.90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు.  వీటిలో పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.  అయితే ఈ సారి మొక్కజొన్న సాగు చేయరాదని అధికారులు సూచిస్తున్నారు. పత్తి గత ఏడాది రెండుల లక్షల ఎకరాల్లో సాగు చేయగా, సారి 2.70 లక్షల ఎకరాలు సాగు చేయించాలని నిర్ణయించారు. కందులు 1,75,900 ఎకరాలు, 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి 35 వేల ఎకరాలు, పెసర 20,800, జొన్న 15 వేలు, మినుములు 9,500 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 2,01,593 పట్టదారు రైతులు ఉన్నారు.  వీరంతా ఏదో ఒక బ్యాంకును రుణాన్ని తీసుకున్నారు. ఒక అంచనా ప్రకారం ఎకరాకు రూ.40 వేలపైగానే రుణం పొందారు. ఈ రైతులంతా ఎస్బీఐ, ,డీజీబి,ఆంధ్రాబ్యాంకు, డీసీసీబీల ద్వారా దాదాపు రూ.2100 కోట్ల వరకు పంటరుణాలు పొందినట్లు తెలుస్తున్నది. ఊదాహరణకు పరిగిలో ఎస్బీఐ ఏడీబీ బ్రాంచిలోనే 11 వేల మంది రైతులు రూ.150 కోట్ల పంటరుణాలను పొందినట్లు చెబుతున్నారు. రుణమాఫీ, పెట్టుబడిసాయం పథకం అమలుతో పంటరుణాల రికవరీలు కూడా నిలిచిపోయాయి. పెట్టుబడి సాయం మంచిదే.. కానీ కొత్తగా పంటరుణాలు కూడా ఇస్తే  బాగుంటుందని రైతులు పేర్కొంటున్నారు. 


సీజన్‌ ఆరంభంలోనే కష్టాలు...

వానాకాలం సీజన్‌ ప్రారంభమై పదిహేను రోజులు గడిచిపోయింది. అధికారులు రైతుబందుకోసం వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రతి ఏటా నిర్వహించే రైతు చైతన్య సదస్సులు కూడా ఈసారి అటకెక్కాయి.  వానాకాలం సీజన్‌లో పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిచే సమయంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు,  సిబ్బంది గ్రామాల్లో భూముల రికార్డులను సరి చేసే పనిలో నిమగ్నమయ్యారు. పంటరుణాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రణాళికలు ఏం చేయలేదని స్వయంగా అధికారులే చెబుతున్నారు. ఈ సారి కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని స్వయంగా బ్యాంకర్లే పేర్కొంటున్నారు. రుణాలకు సంబంధించి అతీగతి లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రుణాలు ఇవ్వపోతే సాగేదెట్లా?

 వానాకాలం సీజన్‌ వచ్చేసింది. రైతుబంఽఽధు డబ్బులు ఏ మూలంకు సరిపోవడం లేదు.  రుణాలు గురించి బ్యాంకర్లను అడిగితే మాకేం  తెలియదని చెబుతున్నారు. రుణాలు ఇవ్వకపోతే పంటలసాగు ఏలా చేయాలి. ప్రభుత్వం స్పందించి ముందస్తుగా పంటరుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి

  - కృష్ణయ్య రైతు, పరిగి 


సన్నహాలు చేస్తున్నాం

రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు చేస్తున్నాం. ఎకరాకు రూ.5 వేల సాయం అందిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలోని ప్రతి రైతుఖాతాలో జమ చేయిం చాం.  వానాకాలం పంటరుణాలకు సంబంధించి మాకే ఏలాంటి ఆదేశాలు  రాలేదు.  రుణాలకు సంబఽంధించి బ్యాంకర్లు, లీడ్‌ బ్యాంకు అధికారులే లక్ష్యాలను నిర్దేశిస్తారు. 

   - గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి 

Updated Date - 2021-06-24T05:20:45+05:30 IST