హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు

ABN , First Publish Date - 2022-08-17T06:52:04+05:30 IST

‘హిందువుల సహనాన్ని ఇక పరీక్షించవద్దు.. దారి తప్పుతున్న మీ యువతను నియంత్రించండి’ అని ముస్లిం మత పెద్దలకు బీజేపీ

హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు

కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్య


బెంగళూరు, ఆగ స్టు 16 (ఆంధ్రజ్యోతి): ‘హిందువుల సహనాన్ని ఇక పరీక్షించవద్దు.. దారి తప్పుతున్న మీ యువతను నియంత్రించండి’ అని ముస్లిం మత పెద్దలకు బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప హెచ్చరిక చేశారు. షిమోగాలో వీరసావర్కర్‌ ఫ్లెక్సీ వివాదం తదనంతర ఘటనలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి మంగళవారం ఆయన వివరించారు. అనంతరం ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. ముస్లిం గూండాల తీరు మారడం లేదని, ఇలా అయితే కొరడా ఝళిపించకతప్పదని అన్నారు. షిమోగా పోలీసులు సోమవారం రాత్రి ముస్లిం గూండాలకు కాల్పుల ద్వారా  శాంపిల్‌ రుచిచూపారని అన్నారు. వీరసావర్కర్‌ విషయంలో రాజీపడే ప్రశ్నేలేదని, ఆయనొక గొప్ప దేశభక్తుడని ఈశ్వరప్ప కొనియాడారు. ముస్లింల పండుగలకు హిందూ సోదరులు సహకరించినట్లే హిందువుల పండుగలకు ముస్లింలు సహకరించాలని కోరారు. కాగా షిమోగా గొడవలకు కారకులైన వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ వదిలిపెట్టే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి బొమ్మై స్పష్టంచేశారు.


షిమోగాలో దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు 

టిప్పు సుల్తాన్‌, వీరసావర్కర్‌ ఫ్లెక్సీల తొలగింపు వివాదంలో దాడికి పాల్పడిన ఒక యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు షిమోగాలో 144 సెక్షన్‌ విధించారు. షిమోగా, భద్రావతి పట్టణాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు. 

Updated Date - 2022-08-17T06:52:04+05:30 IST