Phishing scamలో మాజీ IG: సైబర్ నేరస్తులకు దసరా....

ABN , First Publish Date - 2021-10-14T22:30:19+05:30 IST

కర్ణాటక మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎంబీ

Phishing scamలో మాజీ IG: సైబర్ నేరస్తులకు దసరా....

బెంగళూరు : కర్ణాటక మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎంబీ శంకర్ సైబర్ మోసగాళ్ళ వలలో చిక్కుకుని, రూ.89 వేలు పోగొట్టుకున్నారు. గుర్తింపు వివరాలను ఆధునికీకరించుకోవాలని, లేనిపక్షంలో బ్యాంకు ఖాతాను బ్లాక్ చేస్తామని మోసగాళ్ళు బెదిరించడంతో, వారికి అన్ని వివరాలు ఫోన్‌లోనే చెప్పి బాధితుడయ్యారు. జరిగిన మోసాన్ని గ్రహించి సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


శంకర్ అక్టోబరు 11న ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, నో యువర్ కస్టమర్ (కేవైసీ - మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ఆయన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఈ వివరాలను అప్‌డేట్ చేయనిపక్షంలో బ్యాంకు ఖాతాను బ్లాక్ చేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. కాసేపటికి ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు అధికారినని చెప్పాడు. తాను కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తానని, ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని చెప్పాలని కోరాడు. దీంతో శంకర్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఆ వ్యక్తికి చెప్పారు. కొద్ది నిమిషాల్లోనే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.89,000 వేరొక బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. వెంటనే శంకర్ సంబంధిత బ్యాంకుకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


శంకర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ లావాదేవీని స్తంభింపజేయాలని బ్యాంకు అధికారులను కోరినట్లు చెప్పారు. 


ఇదిలావుండగా, శంకర్ ఈ ఏడాది మార్చిలో కూడా సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైపోయినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ళు ఆయన వ్యక్తిగత ఈ-మెయిల్ అకౌంట్‌ను దుర్వినియోగం చేసి, ఆయన స్నేహితుల నుంచి రూ.25,000 కొట్టేశారని సమాచారం.


Updated Date - 2021-10-14T22:30:19+05:30 IST