కనికరమేదీ..?

ABN , First Publish Date - 2022-06-16T05:48:22+05:30 IST

భారీ వర్షాలు గతేడాది ఖరీ్‌ఫలో సాగుచేసిన పంటలను ముంచెత్తాయి. కొన్నిచోట్ల నీటిలోనే పంటలు కుళ్లిపోయాయి.

కనికరమేదీ..?

పంట పూర్తిగా నష్టపోయినా అందని బీమా

జాబితాలో పేర్లు గల్లంతు

అన్నదాత ఆవేదన

పుట్టపర్తి, జూన 15: భారీ వర్షాలు గతేడాది ఖరీ్‌ఫలో సాగుచేసిన పంటలను ముంచెత్తాయి. కొన్నిచోట్ల నీటిలోనే పంటలు కుళ్లిపోయాయి. పంట దిగుబడి కాదు కదా.. కనీసం పశుగ్రాసం కూడా దక్కలేదు. దీంతో రైతు పూర్తిగా నష్టపోయాడు. అలాంటి రైతుకు కూడా పంటల బీమా దక్కలేదు. పూర్తిగా నష్టపోయిన అన్నదాత పట్ల ప్రభుత్వం కనీస కనికరం చూపలేదని ఆ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. 2021 ఖరీ్‌ఫలో ఎంతో కష్టపడి రైతులు సాగుచేసిన పంటలు అతివృష్టి కారణంగా మట్టిపాలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 8 లక్షల మంది పంట సాగుచేయగా.. కేవలం 1.71 లక్షల మంది రైతులకు మాత్రమే ఉచిత పంటల బీమాను ప్రభుత్వం వర్తింపజేసింది. రూ.400 కోట్లకుపైగా పెట్టుబడి నష్టపోతే.. బీమా కింద రూ.255.78 కోట్లు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వాతావరణ బీమా పేరుతో జిల్లాలో ఎక్కువ మంది రైతులకు మొడిచెయ్యే చూపింది.


18 మండలాలకు మొండిచేయి..

జిల్లాలో అత్యధిక శాతం రైతులు వేరుశనగ పంట సాగు చేశారు. పంటల బీమా మంజూరులో వారికి నిరాశ తప్పలేదు. రొద్దం, పరిగి, చిలమత్తూరు, హిందూపురం, బత్తలపల్లి, కదిరి, మడకశిర, గుడిబండ, కొత్తచెరువు, పుట్టపర్తి, పెనుకొండ, సోమందేపల్లి, బుక్కపట్నం, నల్లచెరువు, తనకల్లు, రొళ్ల, ఓడీసీ, అమరాపురం మండలాల్లో వేరుశనగ సాగు చేసి, రైతులు నష్టపోయారు. వారికి పంటల బీమా అందలేదు. వేలకు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి, వేరుశనగ నష్టపోతే కనీసం బీమా ద్వారా అయినా ఆదుకోలేకపోయారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యధికంగా కనగానపల్లి మండలానికి రూ.20.991 కోట్ల బీమా మంజూరైంది. ఓబుళదేవరచెరువు మండలంలో 521 మంది రైతులకు రూ.82 లక్షలు మాత్రమే విడుదలైంది. కంది పంట సాగుచేసిన రైతులకు సైతం అరకొర బీమానే ప్రభుత్వం విడుదల చేసింది. కనగానపల్లి, రొద్దం ముదిగుబ్బ, రామగిరి మండలాలు మినహా.. కంది రైతులకు బీమా పూర్తిస్థాయిలో దక్కలేదు. అరకొరగానే విడుదలైంది.


అధికారుల తప్పిదమే కారణమా? 

రైతులు సాగు చేసిన పంటను వ్యవసాయాధికారులు ఈక్రాప్‌ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ రైతు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగుచేశాడన్న వివరాలను ఆయా ఆర్బీకేల వ్యవసాయాధికారులు నమోదు చేయాల్సి ఉంది. ప్రధాన పంటైన వేరుశనగను ఈక్రాపింగ్‌ చేయకపోవడంతోనే నష్టపోయామని రైతులు వాపోతున్నారు. దీనిపై జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు.


బీమా వర్తించక నష్టపోయా..

నాలుగెకరాల్లో వేరుశనగ సాగుకు రూ.90 వేల వరకు ఖర్చు వర్చింది. అతివృష్టి వల్ల పెట్టుబడి సైతం కోల్పోయా. మండలంలో వేరుశనగ పంటకు బీమా వర్తించకపోవడంతో నిరాశే మిగిలింది.

దేవానందరెడ్డి, చెర్లోపల్లి, పుట్టపర్తి మండలం


నయాపైసా రాలేదు...

నాకున్న ఎకరం పొలంలో వేరుశనగ, మ రో అర ఎకరంలో మొక్కజొన్న సాగుచేశా. వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతిం ది. మొక్కజొన్న కోత దశలో వర్షాలకు కుళ్లిపోయింది. దీంతో పెట్టుబడే కాకుండా చేతుల కష్టాన్ని కూడా నష్టపోయాను. నయాపైసా కూడా బీమా రాలేదు.

ఆదెప్ప, చిలమత్తూరు మండలం


ఈక్రాప్‌ బుకింగ్‌ చేయక..

నాలుగున్నర ఎకరాలో కంది సాగుచేశా. అది పూర్తిగా దెబ్బతింది. ఈక్రాప్‌ బుకింగ్‌ చేయాలని అధికారులను వేడుకున్నా.. చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే పంటల బీమా కోల్పోయా.

గోవిందరెడ్డి, గుట్టూరు, పెనుకొండ మండలం


Updated Date - 2022-06-16T05:48:22+05:30 IST