మాజీ ఇన్‌స్పెక్టర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..?

ABN , First Publish Date - 2022-07-28T16:30:51+05:30 IST

అత్యాచారం కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది...

మాజీ ఇన్‌స్పెక్టర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..?

జీడీ ఎంట్రీ బుక్‌లో సంతకం ఎవరిది?

స్పెసిమన్‌ సంతకం తీసుకున్న కోర్టు

మరో 12 రోజులు రిమాండ్‌ పొడిగింపు


హైదరాబాద్‌ సిటీ/హయత్‌నగర్‌: అత్యాచారం కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌, రేప్‌, ఆయుధాల చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతడిని 5 రోజులు కస్టడీకి తీసుకొని విచారించి పలు కీలకధారాలు సేకరించారు. 


హయత్‌నగర్‌ కోర్టుకు..

నిందితుడు నాగేశ్వరరావును పోలీసులు బుధవారం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపరిచారు.  వనస్థలిపురంలో మహిళపై అత్యాచారానికి పాల్పడి నిందితుడు.. ఇబ్రహీంపట్నం చెరువుకట్ట వద్ద జరిగిన ప్రమాదం నుంచి బయటపడిన అనంతరం తిరిగి తాను విధులు నిర్వహిస్తున్న మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది. అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు తన రివాల్వర్‌ను స్టేషన్‌లో సబ్‌మిట్‌ చేసి, బెంగళూరు పారిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే నాగేశ్వరరావు నిజంగానే స్టేషన్‌కు వెళ్లాడా..? లేక వెళ్లకుండానే తన రివాల్వర్‌ను వేరే వ్యక్తి ద్వారా స్టేషన్‌కు పంపించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


జీడీ ఎంట్రీ బుక్‌లో ఉన్న సంతకం కూడా అతనిది కాదనే ఆరోపణలు వినిపించడంతో పోలీసులు వాస్తవాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నాగేశ్వరరావుది స్పెసిమన్‌ సంతకాన్ని సేకరించడానికి హయత్‌నగర్‌ కోర్టుకు తీసుకొచ్చినట్లు తెలిసింది. న్యాయమూర్తి సమక్షంలో సంతకాన్ని సేకరించిన అనంతరం తిరిగి అతడిని జైలుకు తరలించారు. నాగేశ్వరరావును కోర్టుకు తీసుకొస్తున్న విషయం తెలుసుకున్న ఆయన భార్య, బావ మరిది, కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు. సాయంత్రం 6:50 గంటల వరకు అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో నాగేశ్వరరావు చాలా సేపు ముచ్చటించినట్లు తెలిసింది. అనంతరం మెజిస్ట్రేట్‌ అనుమతితో పోలీసులు అతడిని జైలుకు తరలించారు. 

Updated Date - 2022-07-28T16:30:51+05:30 IST