ధోనీ ఎంట్రీకి ఐపీఎల్‌ ఎందుకు?

ABN , First Publish Date - 2020-03-18T09:40:05+05:30 IST

భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి ఐపీఎల్‌ 13వ సీజన్‌ అత్యంత కీలకంగా మారుతుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే గతేడాది వన్డే వరల్డ్‌కప్‌

ధోనీ ఎంట్రీకి ఐపీఎల్‌ ఎందుకు?

ముంబై: భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి ఐపీఎల్‌ 13వ సీజన్‌ అత్యంత కీలకంగా మారుతుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ తర్వాత అతను జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడు తిరిగి జట్టులోకి వస్తాడా? లేదా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు ఐపీఎల్‌లో సత్తా నిరూపించుకుంటేనే జట్టులోకి వస్తాడని సాక్షాత్తూ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో పాటు సెలెక్షన్‌ కమిటీ కూడా తేల్చి చెప్పింది. అటు ధోనీ కూడా ఈనెల రెండునే  చెన్నైలో ప్రాక్టీ్‌సను కూడా ఆరంభించాడు. కానీ కొవిడ్‌-19 వైరస్‌ ఉధృతి కారణంగా ఐపీఎల్‌ ఏప్రిల్‌ 15 వరకు వాయిదా పడడంతో అతడు కూడా రాంచీ వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు ఈ లీగ్‌ పూర్తిగా రద్దయితే ధోనీ పరిస్థితేమిటి? మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేని ధోనీ నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలడా? అనే ప్రశ్నలు అతడి అభిమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. అయితే ఈ అంశంపై మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ఏమంటున్నాడంటే...


మహీ అనుభవం చాలు...

 ఐపీఎల్‌లో ఆడినా.. ఆడకపోయినా ఎంఎస్‌ ధోనీ తిరిగి భారత జట్టులోకి రాగలడని కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తేల్చి చెప్పాడు. ‘ఎంఎస్‌ లాంటి ఆటగాడికి అసలు ఐపీఎల్‌ ప్రతిభ ప్రామాణికం కానేకాదు. ఒకవేళ అందులో బాగా ఆడితే విశ్లేషకులు ధోనీని తీసుకోవాలని చెబుతారేమో.. అయితే తానేం చేస్తున్నాడో అతడికి బాగా తెలుసు. జట్టులోకి రావాలా.. లేదా అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంది. నిజంగానే ధోనీకి రావాలని ఉండి.. అటు సెలెక్టర్లకు కూడా ఇదే అభిప్రాయం ఉంటే అతని రాకను ఎవరూ అడ్డుకోలేరు. ఎందుకంటే అపార అనుభవం కలిగిన ధోనీని వదులుకోవడానికి ఏ జట్టూ ఇష్టపడదు. టీ20 ప్రపంచక్‌పలో అతడి సేవలు కావాలని టీమిండియా భావిస్తే ఐపీఎల్‌లో ఆడినా.. ఆడకపోయినా వచ్చే ఇబ్బందేమీ లేదు’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ‘అయినా ధోనీలా పుష్కలంగా అనుభవం ఉన్న ఆటగాళ్లు ఇప్పటికప్పుడు సూపర్‌ మార్కెట్లో దొరకరుగా’ అని చోప్రా అన్నాడు. 

Updated Date - 2020-03-18T09:40:05+05:30 IST