న్యూఢిల్లీ: గుంజన్ సక్సేనా సినిమాపై వాయుసేన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిత్రంలో ఐఏఎఫ్ను కించపరుస్తూ అనేక సన్నివేశాలు ఉన్నాయని వాటిపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ లేఖపై మాజీ పైలట్ గుంజన్ సక్సేనా స్పందించారు. వాయుసేనలో పనిచేసేటప్పుడు తనకు మిగతా వారితో సమానమైన గౌరవమే దక్కేదని, పురుషులకు తగ్గట్టుగానే అవకాశాలు లభించేవని చెప్పారు. తన కలలని నిజం చేసుకోవడానికి కుటుంబంతో పాటు ఐఏఎఫ్ కూడా ఎంతగానో తోడ్పడిందని అన్నారు. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సినిమాలో తన కథను సృజనాత్మకంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సక్సేనా పేర్కొన్నారు. అయితే కమర్షియల్ కోణంలో ఉండటంతో కొన్ని సంఘటనలను, పరిస్థితులను ఎక్కవ చేసి చూపించి ఉండవచ్చని అన్నారు.