ఆర్థిక శాఖ నుంచి కావాలనే పంపించారు!

ABN , First Publish Date - 2020-11-01T08:42:29+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తనను బయటకు పంపించటంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కీలకంగా వ్యవహరించారని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఆరోపించారు...

ఆర్థిక శాఖ నుంచి కావాలనే పంపించారు!

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌పై ఎస్‌సీ గార్గ్‌ ఆరోపణలు 


న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తనను బయటకు పంపించటంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కీలకంగా వ్యవహరించారని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఆరోపించారు. నరేంద్ర మోదీ సర్కారు రెండో సారి అధికారం చేపట్టిన మూడు వారాల్లోనే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి గార్గ్‌ను విద్యుత్‌ శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే గార్గ్‌ ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అరుణ్‌ జైట్లీ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన నిర్మల...విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవారని గార్గ్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నారు. తన మీద ఆమె మాత్రం ఏ విశ్వాసం చూపించలేకపోయేవారని, ఇద్దరి మధ్య పనికి సంబంధించి సత్సంబంధాలు ఉండేవి కావన్నారు. ఆర్‌బీఐ మిగులు నిధులను ప్రభుత్వానికి ఇవ్వటం సహా ఐఐఎ్‌ఫసీఎల్‌ వంటి నాన్‌-బ్యాంకుల క్యాపిటలైజేషన్‌తో పాటు ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటంలో ఇరువురి మధ్య తీవ్రమైన భేదాభ్రిపాయాలు తలెత్తాయని ఆయన తన బ్లాగులో తెలిపారు. 

అయితే గార్గ్‌ బ్లాగులో చేసిన వ్యాఖ్యలపై స్పందించటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సహా నిర్మల సీతారామన్‌ కార్యాలయం నిరాకరించాయి. 1983 బ్యాచ్‌ రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన గార్గ్‌.. 2014లో కేంద్ర సర్వీసుల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా 2017 వరకు కొనసాగారు. అనంతరం 2017 జూన్‌లో డీఈఏ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019 మార్చిలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. అయితే కొద్ది రోజులు మాత్రమే ఆయన ఈ పదవిలో కొనసాగారు. 

Updated Date - 2020-11-01T08:42:29+05:30 IST