ప్రముఖ ఈ-కామర్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు.. అమెరికన్ జంటను టార్గెట్‌ చేసి..

ABN , First Publish Date - 2020-06-17T23:01:30+05:30 IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబేకు చెందిన ఉద్యోగులపై కేసు నమోదు చేసి పోలీసులు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు.. అమెరికన్ జంటను టార్గెట్‌ చేసి..

బోస్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబేకు చెందిన ఉద్యోగులపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మశాచుసెట్స్‌కు చెందిన జంటను గత కొద్ది నెలలుగా ఆన్‌లైన్‌‌లో వేధిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. నిందితుల్లో ఆరుగురు గతంలో ఈబే సంస్థలో పనిచేసినట్టు.. మరికొంతమంది ఇప్పటికి పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితులు భయానికి గురయ్యే విధంగా నిందితులు గత కొద్ది నెలలుగా వివిధ డెలివరీలను పంపుతూ వచ్చినట్టు అధికారులు తెలిపారు. భాగస్వామి చనిపోతే ఎలా బతకాలి అనే పుస్తకం, జంతువుల మాస్క్‌లు, బతికున్న బొద్దింకలను డెలివరీ ద్వారా భార్యాభర్తలు నివసిస్తున్న అడ్రస్‌కు నిందితులు పంపించారు. అంతేకాకుండా భార్యాభర్తల పరువు తీసేందుకు.. వారి ఇరుగు పొరుగు వారికి జంట పేర్లతో పోర్నోగ్రఫీ కంటెంట్‌ను పంపించారు. మరోపక్క భార్యాభర్తలకు బెదిరింపు మెసేజ్‌లను కూడా ఈమెయిల్ ద్వారా పంపిస్తూ వచ్చారు. 


ఈబే సంస్థలో సీనియర్ స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ విధంగా చేయడంపై కంపెనీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన ఉద్యోగులను కంపెనీ నుంచి తీసేసినట్టు ప్రకటించింది. ఇబ్బందులకు గురైన బాధితులకు కంపెనీ యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ నుంచి వెళ్లిపోయిన ఆరుగురితో కలిసి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంతకూ నిందితులు ఈ జంటను ఎందుకు టార్గెట్ చేశారంటే.. ఈ జంట ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి ఆర్టికల్స్ రాసే ఓ ఆన్‌లైన్ న్యూస్‌లెటర్‌కు ఎడిటర్, పబ్లిషర్‌గా పనిచేస్తున్నారు. వీరు కొద్ది నెలల క్రితం పబ్లిష్ చేసిన కంటెంట్.. నిందితులకు నచ్చకపోవడంతోనే వారిపై పగ తీర్చుకునేందుకు ఈ విధంగా దారుణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-17T23:01:30+05:30 IST