వైసీపీకి డీసీసీబీ మాజీ చైర్మన్‌ మోహన్‌ రాజీనామా

ABN , First Publish Date - 2022-07-02T06:09:08+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు వైసీపీకి రాజీనామా చేశారు. అదే సమయంలో మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన వైఖరి కారణంగానే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

వైసీపీకి డీసీసీబీ మాజీ చైర్మన్‌  మోహన్‌ రాజీనామా

మాజీ మంత్రి బాలినేనిపై తీవ్ర విమర్శలు 

 దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్య

ఒంగోలు, జూలై 1 (ఆంధ్రజ్యోతి) :  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు వైసీపీకి రాజీనామా చేశారు. అదే సమయంలో మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన వైఖరి కారణంగానే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు బాలినేనికి రాసిన లేఖ ప్రతులను శుక్రవారం సాయంత్రం మీడియాకు పంపించారు. డీసీసీబీ చైర్మన్‌గా 2013లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికైన ఈదర మోహన్‌ 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. అయితే టీడీపీ హయాంలోనే కొన్ని అనివార్య కారణాలతో ఆయన బ్యాంకు చైర్మన్‌గా వైదొగాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీలో చేరి ఒంగోలులో బాలినేని గెలుపు కోసం కృషిచేశారు. అంతకుముందు 2004, 2009 ఎన్నికల్లోనూ బాలినేని పక్షాన పనిచేసిన ఆయన 2019 ఎన్నికల అనంతరం బాలినేనికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా తాజాగా శుక్రవారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మోహన్‌.. బాలినేనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను బ్యాంకు చైర్మన్‌గా ఉన్న సమయంలో కొందరు అధికారుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. అప్పుడు ఎవరైతే తనను వేధింపులకు గురిచేశారో ఆ అధికారులనే బాలినేని అధికారంలోకి వచ్చాక అందలం ఎక్కించడం అత్యంత దారుణమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మూడు ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం ఎంతో శ్రమంచానన్నారు. వాడుకోవడం, వదిలేయడం, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపేసే నైజం ఉన్న బాలినేని సహాయం చేసిన చేతులనే నరికివేసేలా ప్రవర్తించడం తనను తీవ్రంగా భాధించిందన్నారు. ఆ ప్రవర్తనను ఆ దేవుడు కూడా క్షమించడని బాలినేనిని ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు బహిరంగంగా వైసీపీలో చేరినందున ప్రస్తుతం ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. 





Updated Date - 2022-07-02T06:09:08+05:30 IST