Abn logo
Mar 27 2020 @ 17:11PM

ఎమ్మెల్యేగా తన వేతనాన్ని, బీసీసీఐ పెన్షన్‌ను విరాళంగా ఇచ్చేసిన మాజీ క్రికెటర్

కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రి లక్ష్మీరతన్ శుక్లా కోవిడ్-19పై పోరుకు ముందుకొచ్చారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే వేతనంతోపాటు మాజీ క్రికెటర్‌గా తనకు వస్తున్న పెన్షన్‌ను కరోనా వైరస్‌పై పోరుకు విరాళంగా ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు 735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పశ్చిమ బెంగాల్‌లో 10 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 17 మంది కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 24 వేలమందికిపైగా మృతి చెందారు. 


ఈ సందర్భంగా లక్ష్మీరతన్ శుక్లా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ శక్తిసామర్థ్యాల మేరకు సాయం చేయాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తన మూడు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించానని, అలాగే, బీసీసీఐ నుంచి వచ్చే మూడు నెలల పెన్షన్‌ను కూడా విరాళంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు.


1999లో శుక్లా భారత్ తరపున మూడు వన్డేలు ఆడారు. ఆ తర్వాత మడమ గాయం కారణంగా క్రికెట్‌కు దూరమయ్యారు. ఆల్‌రౌండర్‌గా దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు, ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు. 100కు పైగా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శుక్లా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సభ్యుడు కూడా. 

Advertisement
Advertisement
Advertisement