వికెట్లతో కొట్టి.. బైక్‌ తాళాలతో పొడిచి..!

ABN , First Publish Date - 2022-05-20T08:57:08+05:30 IST

నిద్రపోతున్న ఆ వ్యక్తి పైకి లేవకుండా రెండు కాళ్లపై ఇద్దరు బలమైన వ్యక్తులు కూర్చున్నారు. కదలకుండా గుండెలపైకి ఎక్కి మరోవ్యక్తి కూర్చున్నాడు. మరికొందరు వ్యక్తులు వికెట్లతో రెండు కాళ్లపై విచక్షణారహితంగా కొట్టారు. అప్పటికీ వారి ఆవేశం తగ్గలేదు.

వికెట్లతో కొట్టి.. బైక్‌ తాళాలతో పొడిచి..!

వడ్డీ చెల్లించలేదని యువకుడిపై పైశాచిక దాడి

కాళ్లూ చేతులు విరిగి ఆసుపత్రిలో చికిత్స 

పంచాయితీకి దిగిన ఓ వైసీపీ మాజీ కార్పొరేటర్‌


ఏలూరు, మే 19(ఆంధ్రజ్యోతి): నిద్రపోతున్న ఆ వ్యక్తి పైకి లేవకుండా రెండు కాళ్లపై ఇద్దరు బలమైన వ్యక్తులు కూర్చున్నారు. కదలకుండా గుండెలపైకి ఎక్కి మరోవ్యక్తి కూర్చున్నాడు. మరికొందరు వ్యక్తులు వికెట్లతో రెండు కాళ్లపై విచక్షణారహితంగా కొట్టారు. అప్పటికీ వారి ఆవేశం తగ్గలేదు. గుండెలపై కూర్చున్న వ్యక్తి జేబులో ఉన్న బైక్‌ తాళాలు తీసి గొంతుపై పొడిచాడు. అదృష్టవశాత్తు పక్కనే ఉన్నోళ్లంతా అతన్ని వెనక్కి లాగేశారు. అడ్డొచ్చిన మహిళలను దుర్భాషలాడుతూ, రేప్‌ చేస్తామని బెదిరించిన ఆ వ్యక్తులు.. మరోసారి ఆ యువకుడిపై దాడి చేశారు. చూస్తుంటే ఇదేదో పాత కక్షలనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఏలూరులో కొందరు వడ్డీ వ్యాపారులు తమ వడ్డీ డబ్బులు వసూలు చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇదంతా. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ాలుగు రోజులుగా కొందరు అధికారులు, అధికార పార్టీ మాజీ కార్పొరేటర్‌ బయటకు పొక్కకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పత్తేబాద రైతుబజారుకు ఎదురుగా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకునే మణికృష్ణ అలియాస్‌ గోపీ(29) మూడేళ్ల క్రితం తంగెళ్లమూడికి చెందిన నెరుసు వంశీ అనే వడ్డీ వ్యాపారి నుంచి అప్పు తీసుకున్నాడు. నెలకు రూ.3 వేలు వడ్డీ చెల్లిస్తున్నాడు. మూడు నెలలుగా వ్యాపారం లేదని వడ్డీ చెల్లించడంలేదు. దీంతో మే 15న గోపీ అతడితో గొడవకు దిగాడు. అనంతరం గోపీ అన్నదమ్ములు, మరొకందరు వంశీని కలిశారు. మూడేళ్లుగా వడ్డీ కడుతున్నాడని, ఇకపై అతడు చెల్లించలేడని.. మూడు నెలల్లో రూ.20 వేలు ఇచ్చేస్తాడని, ఇక వదిలేయాలని రాజీ కుదిర్చారు. సరేనని అంగీకరించి వెనక్కి వెళ్లిన వంశీ..  మధ్యాహ్నం  గోపీ బండి వద్దకు వెళ్లి, మళ్లీ గొడవకు దిగాడు. నిద్రపోతున్న గోపీపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. వంశీకి కాళ్లు, చేతులు విరగడంతో అదేరోజున ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్చి చికిత్స  చేస్తున్నారు.  ఆ రోజే పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, వివాదంపై ఎవరూ స్పందించకుండా ఓ వైసీపీ కార్పొరేటర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులపై ఒతిడి తెస్తున్నారని సమాచారం.

Updated Date - 2022-05-20T08:57:08+05:30 IST