అధికారులకు శిక్షణ ఇవ్వలేదా?

ABN , First Publish Date - 2021-10-23T08:04:47+05:30 IST

ఆర్టీఐ దరఖాస్తులకు అందించే సమాచారాన్ని పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లు(పీఐవో) సరి చూసుకోకుండా తప్పుగా ఇస్తున్నారంటే అది ప్రభుత్వ లోపమేనని కేంద్ర సమాచార మాజీ కమిషనర్లు మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు, శైలేష్‌ గాంధీ పేర్కొన్నారు.

అధికారులకు శిక్షణ ఇవ్వలేదా?

  • తప్పుడు సమాచారమిస్తున్నారంటే లోపం ప్రభుత్వానిదే 
  • ముందు ఆర్టీఐపై అవగాహన పెంచుకోండి 
  • సీఎస్‌ సోమేశ్‌కు కేంద్ర మాజీ కమిషనర్ల క్లాస్‌
  • ఆర్టీఐ సవరణలపై మాడభూషి శ్రీధర్‌, శైలేష్‌ గాంధీ లేఖ


హైదరాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఆర్టీఐ దరఖాస్తులకు అందించే సమాచారాన్ని పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లు(పీఐవో) సరి చూసుకోకుండా తప్పుగా ఇస్తున్నారంటే అది ప్రభుత్వ లోపమేనని కేంద్ర సమాచార మాజీ కమిషనర్లు మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు, శైలేష్‌ గాంధీ పేర్కొన్నారు. పీఐవోలు తప్పుడు సమాచారం ఇస్తున్నందున ఇక నుంచి రాష్ట్ర స్థాయిలో అనుమతి తీసుకున్న తర్వాతే అందించాలంటూ ఇటీవలే సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ కమిషనర్లు శుక్రవారం సీఎ్‌సకి లేఖ రాశారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌-26 ప్రకారం చట్టంపై అధికారులకు శిక్షణ అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.


అధికారులు తప్పులు చేస్తే వారి స్థానంలో పీఐవోలుగా ఇతర సీనియర్‌ అధికారులను నియమించవచ్చని, అంతేతప్ప పార్లమెంటు ఆమోదించిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారమంతా అఽధికారులు వెబ్‌సైట్లో స్వచ్చందంగా వెల్లడిస్తే అసలు ఆర్టీఐ దరఖాస్తులు స్వీకరించే అవసరమే ఉండదని సూచించారు. కింది స్థాయి సమాచారాన్ని రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి స్థాయి అధికారులు పరిశీలించేందుకు అసలు వారివద్ద వివరాలు ఉంటాయా? ప్రభుత్వం రికార్డులన్నీ కంప్యూటరీకరించిందా అని ప్రశ్నించారు. పీఐవోల అధికారాలను రాష్ట్రస్థాయి అధికారులకు అప్పగిస్తే పౌర సమాజం సమాచారం పొందేందుకు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి ఉంటుందని కేంద్ర మాజీ కమిషనర్లు తెలిపారు. సకాలంలో సమాచారం ఇవ్వని పీఐవోలపై చట్టం ప్రకారం గరిష్ఠంగా రూ.25వేల జరిమానా విధించాల్సి ఉంటుందని, దీనిని రాష్ట్ర ఉన్నతాధికారులు చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. ఆర్టీఐ దరఖాస్తు అవసరం లేకుండా ప్రభుత్వమే బాధ్యతగా ఉన్న సమాచారమంతా స్వచ్చందంగా వెల్లడించాలని మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు, శైలేష్‌ గాంధీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లో ఉంచిన ఆర్టీఐ చట్టం గురించి ముందు తెలుసుకోవాలని వారు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సూచించారు. 

Updated Date - 2021-10-23T08:04:47+05:30 IST