ఆర్థిక చాణక్యుడి అస్తమయం!

ABN , First Publish Date - 2021-12-05T08:50:51+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అజాతశత్రువుగా పేరొందిన రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య (88) ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఉదయాన్నే 5.30కి నిద్రలేచిన ఆయన..

ఆర్థిక చాణక్యుడి అస్తమయం!

రాజకీయ కురువృద్ధుడు, మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

ఉదయం నిద్రలేవకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

మార్గమధ్యంలోనే తుది శ్వాస 

కుటుంబ సభ్యులు, నేతల దిగ్ర్భాంతి

పార్థివదేహానికి నివాళులర్పించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

తెలంగాణ సీఎం కేసీఆర్‌, చంద్రబాబు, కేవీపీ సహా పలువురు ప్రముఖులూ..

నేడు గాంధీభవన్‌కు భౌతికకాయం

సోనియా తరఫున వస్తున్న ఖర్గే

అనంతరం దేవరయాంజల్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

2 రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు

రోశయ్యకు ‘భారత రత్న’ ఇవ్వాలి

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్‌


ఆర్థిక మంత్రి అంటే ఆయనే గుర్తుకొస్తారు! నోరు పారేసుకోరు కానీ... చురకత్తి మాటలతో ప్రత్యర్థులను గుచ్చేస్తారు! తానుగా  పదవులు ఆశించరు. ఇచ్చిన పదవికి వందశాతం న్యాయం చేస్తారు. బలమైన రాజకీయ నేపథ్యం లేదు. సొంత వర్గమూ లేదు. అయినా సరే... అనేక శాఖలను నిర్వహించిన మంత్రిగా ఖ్యాతి గడించారు. అనుకోని పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్‌ పదవి తర్వాత ప్రశాంత జీవితం గడిపారు. అంతే ప్రశాంతంగా కన్ను మూశారు! ఆయనే... రాజకీయ కురువృద్ధుడు రోశయ్య! ఆ పెద్దాయన ఇక లేరు!


‘‘ప్రభుత్వంలోనైనా... ఇంట్లోనైనా దుబారా ఖర్చు పెట్టవద్దనేది నా విధానం. ఒక ట్యాంకులో పడే నీళ్లకంటే కింది నుంచి వృథాగా పోయేది ఎక్కువైతే ఏం జరుగుతుంది? ట్యాంకు ఖాళీ అవుతుంది. ప్రభుత్వంలో ఈ సులభ సూత్రాన్నే నేనూ పాటిస్తాను!’’


‘‘లాయర్‌ కావాలనుకున్నా. రాజకీయాల్లోకి వచ్చాక ఆ సంగతి మరిచిపోయాను. పెద్ద పదవులు అధిష్టించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, పెద్ద వాళ్లతో కలిసి పని చేయాలని ఉండేది. ఆ కోరిక తీరింది. విద్యార్థి సంఘాల సమావేశం కోసం కశ్మీర్‌కు వెళ్లాను. అప్పట్లో శ్రీనగర్‌లో నాటి ప్రధాని నెహ్రూను కొందరు రైతులు కలిశారు. వారికి హిందీ, ఇంగ్లీషు రావు. అప్పుడు అనుకోకుండా నేను నెహ్రూకు దుబాసీలా వ్యవహరించాను. మాది ఆంధ్రా అంటే గుర్తుపట్టలేదు. మదరాసీ అంటేనే నెహ్రూ గుర్తుపట్టారు!’’


రోశయ్య

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అజాతశత్రువుగా పేరొందిన రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య (88) ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఉదయాన్నే 5.30కి నిద్రలేచిన ఆయన.. కాలకృత్యాల అనంతరం మళ్లీ నిద్రపోయారు. సాధారణంగా ఉదయం 7.15కి నిద్రలేస్తారు. 7.30 వరకూ లేవకపోవడంతో.. ఆయన నాడి పరిశీలించిన కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు.  అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే ఆయన మరణించారని ఆస్పత్రి వర్గాలు ఉదయం 8.20 గంటలకు ప్రకటించాయి.


10.20కి భౌతిక కాయాన్ని అమీర్‌పేట్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయనకు భార్య శివలక్ష్మి, ముగ్గురు కుమారులు శివ సుబ్బారావు, త్రివిక్రమరావు, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు. రోశయ్య కొంత కాలంగా వయోసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా.. రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గాంధీభవన్‌లో ఉంచుతారు. అక్కడి నుంచి దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు. అధికా ర లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా శనివారం నుంచి సోమవారం దాకా సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు తెలిపింది.


ఇలా జరుగుతుందనుకోలేదు: కుటుంబం

వయసు మీద పడడంతో కొంతకాలంగా నాన్న ఇంటిలోనే ఉంటున్నారని రోశయ్య పెద్ద కుమారుడు శివసుబ్బారావు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు అందరితో మాట్లాడి నిద్రపోయారని.. తెల్లవారుజామున కాలకృత్యాలకు నిద్రలేచిన తర్వాత మళ్లీ పడుకున్నారని, ఉదయం 7.30 అనంతరం లేవకపోవడంతో ఆందోళనకు గురై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారని చెప్పారు. మామయ్య ఒక్కసారిగా ఇలా అవుతాడని అనుకోలేదని.. బీపీతో పల్స్‌ పడిపోయిందని భావించామని, ఆస్పత్రిలో చికిత్స అందిస్తే కుదురుకుంటాడని అనుకున్నామని.. ఇంతలోనే మమ్మల్ని విడిచి వెళ్లారని చిన్నకోడలు సుహాసిని వాపోయారు.




చీఫ్‌ జస్టిస్‌ రమణ, కేసీఆర్‌ నివాళులు..

రోశయ్య మృతిపై కుటుంబసభ్యులు, స్నేహితులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. హైదరాబాద్‌లోనే ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు....రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆంధ్ర, తమిళనాడు సీఎంలు జగన్‌, స్టాలిన్‌ ఆదివారం హైదరాబాద్‌ రానున్నట్లు తెలిసింది. రోశయ్య పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తరపున రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నివాళులు అర్పించనున్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు నేరుగా వచ్చి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కాగా.. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ), కార్యవర్గ ఉమ్మడి సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరిగింది. రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించింది. 


దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలితతో ..


దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో రోశయ్య




ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న రోశయ్య


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న రోశయ్యరోశయ్యను సత్కరిస్తున్న రాహుల్‌ గాంధీ


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రారంభోత్సవంలో రోశయ్య, చంద్రబాబు


సంక్షోభానికి ‘సమాధానం’

అసెంబ్లీలో ప్రభుత్వానికి ఏదైనా గట్టి సంక్షోభం ఎదురైతే... దానికి సానుకూల ‘ముగింపు’ పలికే బాధ్యతను రోశయ్యకే అప్పగించేవారు. మరీ ముఖ్యంగా... వైఎస్‌ హయాంలో రోశయ్య ‘క్రైసిస్‌ మేనేజర్‌’గా వ్యవహరించారు. సంబంధిత శాఖ మంత్రితో కాకుండా... రోశయ్య చేత ప్రకటన ఇప్పించేవారు. ఆ వివాదానికి సంబంధించి... అంటీ అంటనట్లు, నొప్పించక తానొవ్వక, లౌక్యంగా... విపక్షానికి చురకలు వేస్తూనే ఒక ప్రకటన చేసి దానికి అంతటితో ముగింపు పలికేలా చేయడం రోశయ్య స్టైల్‌!


ఔను... బూట్లు వేసుకున్నా!

ఏ విషయంలోనైనా సరే... అప్పటికప్పుడు స్పష్టత ఇస్తే అది అంతటితో ముగుస్తుందని, తదుపరి వివాదాలు తలెత్తవని రోశయ్య నమ్మేవారు. ఇందుకు మచ్చుకు ఒక ఉదాహరణ... అచ్చ తెలుగు ఆహార్యానికి రోశయ్య నిలువెత్తు రూపం. తెల్లని పంచెకట్టు.. ఖద్దరు చొక్కా.. భుజంపై కండువాతో.. నిండుగా కనిపించేవారు. ఎప్పుడూ చెప్పులు మాత్రమే ధరించేవారు. అలాంటిది... ముఖ్యమంత్రి కావడానికి కొద్ది రోజుల ముందు హైదరాబాద్‌లోని సచివాలయం డి-బ్లాక్‌ పోర్టికోలో మొదటిసారిగా తళతళ మెరిసే స్పోర్ట్స్‌ షూతో కిందికి దిగారు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్‌లు చకచకా ఆయన ఫొటోలు తీశారు. వెంటనే ఆయన మీడియా ప్రతినిధులందరినీ పిలిచారు. ‘‘నేను మీలాగా కుర్రాడిని కాదు. ఈ బూట్లు వేసుకుని ఎక్కడికీ పరిగెత్తలేను. డాక్టర్‌ సలహా మేరకు ఆరోగ్య రీత్యా బూట్లు తొడుక్కున్నాను’’ అని అని చెప్పారు.


మండలి రద్దు ఆయన వల్లేనా!

1958లో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఏర్పాటైంది. పెద్దల సభగా అనేక మంది మహామహులకు వేదికగా మారింది. అయితే... 1985 మే 31న నాటి ముఖ్యమంత్రి  ఎన్టీఆర్‌ శాసన మండలిని రద్దు చేసేశారు. ‘దీనికి కారణం నేనే’ అని రోశయ్య చెప్పుకొనేవారు. ఎందుకంటే... అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ మండలిలో కాంగ్రె్‌సకు మెజారిటీ ఉండేది. మండలి సభ్యుడిగా ఉన్న రోశయ్య అక్కడ అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టేవారు.  ఈ నేపథ్యంలో... ‘ఈ చికాకులు ఎన్నాళ్లు భరిస్తాం. మండలిని రద్దు చేసేస్తాం’ అని ఎన్టీఆర్‌ తాను అన్నంత పనీ చేసేశారు.


చురకలు... చురకత్తులు

 రోశయ్య మంత్రిగా ఉండగా... ఆయన అల్లుడు పేకాట ఆడుతూ, డ్యాన్సులు చూస్తూ దొరికిపోయారని శాసనసభలో తెలుగుదేశం సభ్యులు ఆరోపణలు చేశారు. చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట సేపు రచ్చరచ్చ చేశారు. రోశయ్య స్థానంలో మరెవరైనా ఉంటే... బాగా ఆత్మరక్షణలో పడిపోయేవారు. కానీ... రోశయ్య కదా, తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చేశారు. ‘‘ఏం చేస్తాం అధ్యక్షా! ఆ భగవంతుడు ఎన్టీఆర్‌కు, నాకూ మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని అన్నారు. అంతే... సభలో ఒక్కసారిగా నవ్వులు! 


గోనె సంచుల్లో చందాలు... కానీ

‘మీరు చీరాల అసెంబ్లీ బరిలో నిలిచినప్పుడు గోనె సంచుల్లో చందాలు వచ్చాయట కదా!’ అని మీడియా ప్రతినిధులు రోశయ్యను అడిగారు. ‘‘ అవును. వచ్చాయి! కానీ ఏం లాభం! మావాళ్లంతా వ్యాపారస్తులే కదా! అంతా.. ఒకటి రెండు రూపాయల బిళ్లలూ .. నోట్లూ ఇచ్చేవారు. అవన్నీ కలిపితే.. ఐదు వేల రూపాయలు కూడా అయ్యేవి కావు’’ అని సరదాగా స్పందించారు.

Updated Date - 2021-12-05T08:50:51+05:30 IST