భారత జెండా ఎగురవేయనన్న ముఫ్తీ..!

ABN , First Publish Date - 2020-10-25T03:38:07+05:30 IST

జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఓ రకంగా భారత్‌పై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...

భారత జెండా ఎగురవేయనన్న ముఫ్తీ..!

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఓ రకంగా భారత్‌పై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు యావత్‌ భారతదేశానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.  ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యంతరం తెలిపిందంటే ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించినప్పటి నుంచీ మెహబూబా ముఫ్తీ నిర్బంధంలో ఉన్నారు. అయితే 14 నెలల తరువాత ఈ మధ్యనే బయటికొచ్చారు. బయటికొచ్చినప్పటి నుంచి ఆర్టికల్ 370 తొలగింపు విషయంలో విపరీత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అందులో భాగంగానే ఆమె తాజాగా త్రివర్ణ పతాకంపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో ప్రత్యేక జెండా ఎగురవేసేందుకు అనుమతి లభించేవరకూ భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తాను ఎగురవేయనంటూ మెహబూబూ ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని.. మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. అప్పటి వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయనన్నారు.


మెహబూబా వ్యాఖ్యలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్‌ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. భారత గడ్డపై ఏ శక్తి కూడా మళ్లీ ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించడం గానీ, జమ్ముకశ్మీర్ ప్రత్యేక జెండాను ఎగురవేయడం గానీ చేయలేవని, అది అసాధ్యమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. భారతదేశ జెండా, దేశం, మాతృభూమి కోసం ఎందరో రక్తం చిందించారని.. జమ్ము కశ్మీర్‌ ఈ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేశారు. దేశంలో ఎగిరేది ఒకే ఒక్క జెండా అని.. అది త్రివర్ణ పతాకం మాత్రమేనని తేల్చి చెప్పారు. 


జమ్మూ కాశ్మీర్‌ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, కానీ ముఫ్తీ వ్యాఖ్యలు ఆ ప్రశాంతతను నాశనం చేసేలా ఉన్నాయని బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. కశ్మీర్‌ ప్రజలను రెచ్చగొట్టేలా ముఫ్తీ వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఏదైనా జరిగితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. శాంతి, సాధారణ స్థితి, సోదరభావానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చిరంచారు. అదే విధంగా కశ్మీరీ నాయకులు భారతదేశాన్ని సురక్షితం కాదని భావిస్తే.. వెంటనే పాకిస్తాన్ లేదా చైనాకు వెళ్లిపోవచ్చని సూచించారు.


మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని.. త్రివర్ణ పతాకమనేది భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని స్పష్టం చేసింది. అటువంటి జెండాను ఎగురవేయడానికి ఆంక్షలు పెట్టడం సరికాదని, ముఫ్తీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

Updated Date - 2020-10-25T03:38:07+05:30 IST