Former CM: కాంగ్రెస్‌, బీజేపీ రహిత రాజకీయ శక్తి కోసమే..

ABN , First Publish Date - 2022-10-07T17:09:25+05:30 IST

కాంగ్రెస్‌, బీజేపీ రహిత రాజకీయ శక్తి కోసమే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మైత్రి అని మాజీ సీఎం కుమారస్వామి(Former

Former CM: కాంగ్రెస్‌, బీజేపీ రహిత రాజకీయ శక్తి కోసమే..

- కేసీఆర్‌తో మైత్రిపై మాజీ సీఎం కుమారస్వామి

- జేడీఎస్‌ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ


బెంగళూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీజేపీ రహిత రాజకీయ శక్తి కోసమే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మైత్రి అని మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ ఆవిష్కరించిన భారత్‌ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ కార్యక్రమంలో జేడీఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. బెంగళూరుకు వెనుదిరిగే వేళ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మిత్రపక్షాలుగా ఉంటాయన్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో ముందు నుంచి సన్నిహితమే ఉందని, భవిష్యత్తులోనూ బీఆర్‌ఎస్‌, జేడీఎ్‌సలు కలిసి పనిచేస్తాయన్నారు. బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ పార్టీగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసి ముందుకెత్తాయన్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ రహిత ప్రభుత్వాలు ఉన్నాయని, అదే పరిస్థితిని కర్ణాటకలోనూ నిర్మించేందుకు చంద్రశేఖర్‌రావుతో కలిసి పనిచేస్తామన్నారు. డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు మరికొంతమంది చేతులు కలుపుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల ఫలితాలే ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచి కానున్నాయన్నారు. కర్ణాటక జాతీయ రాజకీయాల్లో బలమైన శక్తిగా జేడీఎస్‌ మారనుందన్నారు. 


జేడీఎస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్‌

జేడీఎస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం తరహాలోనే రైతులకు 24/7 ఉచిత విద్యుత్‌ అందిస్తామని జేడీఎ్‌సనేత మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించారు. గురువారం బెంగళూరు జేడీఎస్‌ కార్యాలయం లో  మీడియాతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్‌ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) పేరుతో జా తీయ పార్టీ ఏర్పాటయ్యిందని జేడీఎస్‏తో మైత్రి కొనసాగుతుందన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలలో పోటీ చేయదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని సరిహద్దు నియోజకవర్గాలలో కొంతమంది అభ్యర్థులచే పోటీ చేయిస్తారన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళామన్నారు. కేసీఆర్‌తో ఎన్నో విషయాలు మాట్లాడామన్నారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటుకు నిం డుమనసుతో స్వాగతిస్తున్నట్లు తెలిపారు.


నాగురించి మాట్లాడడం గొప్ప కాదు..

సీఎం బసవరాజ్‌బొమ్మైకు పరిణితి లేదని మండిపడ్డారు. నా మెచ్యూరిటీ గురించి సీఎం మాట్లాడటం గొప్పగా భావించి ఉండవచ్చునన్నారు. కళాకారుల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలకు రూ.50కోట్ల గ్రాంటు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏ ఉద్దేశ్యం కోసం కేటాయించారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్‌ కారుపై జేడీఎస్‌ కార్యకర్తలు దాడి చేస్తే ఇదంతా పరిణతి లేని వారు చేసేదిగా సీఎం మాట్లాడటం సరికాదన్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేదని లేదని సవాల్‌ చేశారు. 2006లో ముఖ్యమంత్రిగా 20నెలల పాటు పాలన సాగించానని ఒక అవినీతి మచ్చలేదన్నారు. అదే జేడీఎస్‌ గొప్పతనమన్నారు. రోజూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేవారు ఎవరో అందరికీ తెలిసిందే అన్నారు.

Updated Date - 2022-10-07T17:09:25+05:30 IST