Former Chief Minister: ఎమ్మెల్యేగా నా హక్కులను కాలరాశారు

ABN , First Publish Date - 2022-10-02T15:46:32+05:30 IST

రామనగర జిల్లాలోని చెన్నపట్టణ శాసనసభ నియోజకవర్గంలో తనను ఆహ్వానించకుండా, తన దృష్టికి తీసుకురాకుండా రూ.50 కోట్లతో

Former Chief Minister: ఎమ్మెల్యేగా నా హక్కులను కాలరాశారు

                          - నిప్పులు చెరిగిన మాజీ సీఎం కుమారస్వామి


బెంగళూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రామనగర జిల్లాలోని చెన్నపట్టణ శాసనసభ నియోజకవర్గంలో తనను ఆహ్వానించకుండా, తన దృష్టికి తీసుకురాకుండా రూ.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంపై స్థానిక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా సభ్యుడి హక్కుల ఉల్లంఘనే అన్నారు. తదుపరి శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై నోటీసు ఇస్తానన్నారు. తనకు జరిగిన అవమానంపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఇందుకు కారకులైన అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరులోని జేడీఎస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలోనే ఆయా నియోజకవర్గాల్లో చేపట్టే ఏ ప్రభుత్వ కార్యక్రమానికైనా స్థానిక ఎమ్మెల్యేను తప్పనిసరిగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రే స్వయంగా ఆదేశాలు జారీ చేశారని, ఇప్పుడు వీటిని తుంగలోకి తొక్కారని ఆరోపించారు. ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించకుండా నామినేటెడ్‌ ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్‌తో వీటిని ప్రారంభించడం దారుణమన్నారు. ఎవరిని సంతోషపెట్టేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదన్నారు. ప్రొటోకాల్‌ను విస్మరించిన కర్ణాటక‘(Karnataka) గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ అధికారులను తక్షణం సస్పెండ్‌ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తనకు అవమానం జరగడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఒకసారి జరిగిందని స్పీకర్‌ దృష్టికి తెచ్చినా ప్ర యోజనం దక్కలేదని వాపోయారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తనకే ప్రొటోకాల్‌ అమలు కావడం లేదని, ఇక ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలన్నారు. 

Updated Date - 2022-10-02T15:46:32+05:30 IST