Former Chief Minister: క్షీణించిన శాంతిభద్రతలు

ABN , First Publish Date - 2022-09-21T13:51:43+05:30 IST

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని, కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు

Former Chief Minister: క్షీణించిన శాంతిభద్రతలు

- మాజీ సీఎం ఎడప్పాడి 

- సత్వరమే చర్యలు చేపట్టాలంటూ అమిత్‌షాకు వినతి


చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని, కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఢిల్లీలో అమిత్‌షాను కలుసుకున్న ఆయన డీఎంకే ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు వేలుమణి, సీవీ షణ్ముగంతో కలిసి వెళ్లిన ఆయన అమిత్‌షాతో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తనకు సహకారం అందించాలని అమిత్‌షా(Amit Shah)కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. బీజేపీ పెద్దలకు అనుకూలంగానే వుంటానని, అందువల్ల తనకు అన్ని విధాలుగా సహకరించాలని కోరడంతో పాటు పార్టీలోకి వచ్చేందుకు ఓపీఎస్‌, శశికళ యత్నాలను కూడా అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం. వారిని పార్టీ లోకి చేరనిచ్చే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం ఈపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఆధారాలతో వినతి పత్రాన్ని సమర్పించానని తెలిపారు. రాజకీయపరమైన అంశాలపై అమిత్‌షాతో చర్చించలేదని, అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రతిపాదిపాదించిన కావేరి - గోదావరి నదుల అనుసంధాన పథకం, కావేరి నదీజలాలను శుభ్రపరిచే ‘నడందాయ్‌ వాళి కావేరి’ పథకం గురించి చర్చించి ఆ రెండు పథకాలను త్వరితగతిన అమలు చేయాలని కోరానని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకూ హత్యలు, మానభంగాలు అధికమయ్యాయి, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమరవాణా అధికమై వాటికి యువత భావిసవుతున్నా డీఎంకే(DMK) ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కఠిన చర్యలు చేపట్టడం లేదన్నారు. అందుకే తాను కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించానన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు న్యాయస్థానంలో వున్నందున, తానెలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తానిప్పటకే 20 జిల్లాల్లో పర్యటించిన పార్టీ శ్రేణులను కలుసుకున్నానని, త్వరలో జిల్లాల వారీ పర్యటన మళ్ళీ కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ చార్జీలను స్వల్పంగా పెంచినప్పుడు ఆందోళన చేసిన స్టాలిన్‌.. అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల నడ్డివిరిచేలా విద్యుత్‌ చార్జీలను పెంచారని ఈపీఎస్‌ ఆరోపించారు.

Updated Date - 2022-09-21T13:51:43+05:30 IST