తాళ్లపల్లి వెంకటనారాయణ(ఫైల్ ఫొటో)
నివాళులర్పించిన వివిధ పార్టీల నాయకులు
రామగిరి, జనవరి 27: నల్లగొండ మునిసిపల్ మాజీ చైర్మన్ తాళ్లపల్లి వెంకటనారాయణ(100) గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచి 1961 నుంచి 1967 మధ్యకాలంలో నల్లగొండ మునిసిపాలిటీకి రెండో చైర్మన్‌గా వ్యవహరించారు. 1960లో మునిసిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయనకు దక్కింది. 1962 నుంచి 1972 మధ్యకాలంలో ఇండస్ర్టియల్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. ఇదే క్రమంలో నల్లగొండ రైల్వే సాధన కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. నల్లగొండకు వచ్చిన రైల్వే లైన్ రిపోర్టును అప్పటి ప్రధాని ఇందిరిగాంధీకి అందజేశారు. రెడ్‌క్రాస్ సేవలో ఉత్తమ సేవలు అందించినందుకు 2004లో అప్పటి గవర్నర్ సూర్జిత్‌సింగ్ బర్నాలా గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడిగా వెంకటనారాయణను 2019లో బేగంపేట్‌లో జరిగిన మహాసభలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిశషన్‌రెడ్డి ఆయనను సన్మానించారు. కొంతకాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. వెంకటనారాయణ కుమారుడు మధు సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొపెసర్‌గా పని చేస్తున్నారు. వెంకటనారాయణ పార్థివదేహాన్ని వివిధ పార్టీల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.